Share News

Seethakka: ప్రతి తండాకు బీటీ రోడ్డు..

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:54 AM

రాష్ట్రంలోని ప్రతి తండాకు, గూడేనికి బీటీ రోడ్లు వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి గిరిజన ఆవాసానికి రవాణా, తాగునీటి సౌకర్యం, వారి పిల్లలు చదువుకునే అవకాశం కల్పించినప్పుడే.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం, ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరినట్లు తాము భావిస్తామన్నారు.

Seethakka: ప్రతి తండాకు బీటీ రోడ్డు..

  • తండాల నుంచి మండల కేంద్రానికీ రోడ్లు వేస్తాం

  • రెవెన్యూ గ్రామాలుగా కొత్త పంచాయతీలు: సీతక్క

  • పాఠశాలల కోసం ప్రత్యేక బస్సులు: పొన్నం

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి తండాకు, గూడేనికి బీటీ రోడ్లు వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి గిరిజన ఆవాసానికి రవాణా, తాగునీటి సౌకర్యం, వారి పిల్లలు చదువుకునే అవకాశం కల్పించినప్పుడే.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం, ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరినట్లు తాము భావిస్తామన్నారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికీ తాగునీరు అందించినట్లు చెప్పిందని, కానీ.. పంచాయతీల నుంచి తీర్మానం తెప్పించుకుంటే.. దాదాపు ఏడు లక్షల ఆవాసాలకు తాగునీటి సౌకర్యం లేనట్లుగా గణాంకాలు వచ్చాయని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ సభలో బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సీఎం స్పందిస్తూ, ‘‘‘ప్రజలు శిక్షించినా మీలో మార్పు రాలేదు.


ఆ దేవుడు మీకు మంచి ఆలోచనలు వచ్చేలా చూడాలి’’ అని అన్నారు. తన నియోజకవర్గంలోని బొంరా్‌సపేట మండలంలో 72 తండాలుంటే.. వాటిలో చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదని, అయినా కొన్ని పంచాయతీలుగా మారాయని అన్నారు.తండాలో కనీసం పాఠశాల లేకపోయినా, రోడ్డు, కరెంట్‌ సౌకర్యం లేకున్నా పంచాయతీలుగా హోదా ఇచ్చారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి.. మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందన్నారు. తండాల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేయడంతోపాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు మిగిలిపోయిన డబుల్‌ లేన్‌ రోడ్ల పనులను పూర్తి చేస్తామని, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు లేన్ల రోడ్లు వేస్తామని ప్రకటించారు.


పంచాయతీలను నిర్వీర్యం చేశారు..

రాష్ట్రంలో భూముల సర్వే చేపట్టకపోవడంతో కొత్త రెవెన్యూ గ్రామాలను రెవెన్యూశాఖ ఏర్పాటు చేయలేకపోయిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ అంశంపై రెవెన్యూ శాఖతో చర్చించి, సర్వే అనంతరం.. పంచాయతీలుగా మారిన తండాలు, గూడేలను రెవెన్యూ గ్రామాలుగా మార్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా చేసినా పక్కా భవనాలు కేటాయించలేదని, పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.


కాగా, సంఖ్యాబలం చూపించడానికి ఒక తండాను రెండు గ్రామ పంచాయతీలుగా మార్చారని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ విమర్శించారు. తండాలను పంచాయతీలుగా మార్చి నా.. రెవెన్యూ పంచాయతీలుగా గుర్తింపు ఇవ్వలేదని ఎమ్మె ల్యే రాంచందర్‌నాయక్‌ అన్నారు. కాగా, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడిపిస్తామని రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.

Updated Date - Jul 25 , 2024 | 04:54 AM