Share News

Colleges: ఇంజనీరింగ్‌ కాలేజీలు సొంతంగా సీట్లు భర్తీ చేసుకోవచ్చు!

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:45 AM

ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.

Colleges: ఇంజనీరింగ్‌ కాలేజీలు సొంతంగా సీట్లు భర్తీ చేసుకోవచ్చు!

  • ప్రభుత్వంతో సంబంధం లేకుండా భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అనుమతి

  • మాప్‌అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనందుకు అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం

  • సుప్రీంలో సవాల్‌ చేయనున్న సర్కార్‌

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పెంచిన సీట్లకు, కోర్సులకు మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సెప్టెంబర్‌ 9న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వాటి ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించనందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉత్తర్వులను అమలు చేసే ఉద్దేశం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ‘‘కోర్టు ధిక్కరణ చర్యల కింద శిక్ష విధిస్తే దానిపై సుప్రీంకు వెళ్లడం ద్వారా కాలయాపన చేద్దామని అనుకుంటున్నారు. టెక్నికల్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియకు అక్టోబర్‌ 23వ తేదీ దాటిపోతే గడువు తీరిపోతుంది కాబట్టి చేతులెత్తేద్దామనుకుంటున్నారు’’ అని పేర్కొంది.


కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేసిన కాలేజీలకు సీట్లు భర్తీ చేసుకునేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ తీర్పును సుప్రీంలో సవాల్‌ చేయాలని సర్కారు నిర్ణయించింది. సీట్ల పెంపుకు ఏఐసీటీఈ అనుమతినిచ్చినా, జేఎన్టీయూ అనుమతిలేనిదే కోర్సులకు గుర్తింపు ఉండదు. ఇప్పటికే కౌన్సెలింగ్‌ పూర్తయిన వాటిలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే గతంలో వేరే కోర్సుల్లో చేరిన వారు, దూరం కాలేజీలో చేరినవారు మళ్లీ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. కాలేజీలు భర్తీ చేసుకున్నా ప్రభుత్వ అనుమతి లేనందున విద్యార్థులకు సర్టిఫికేట్స్‌ వచ్చే అవకాశం లేదు. ఇంకోవైపు, సింగిల్‌ జడ్జి బెంచ్‌ నుంచి వెలువడే పూర్తిస్థాయి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని డివిజన్‌ పేర్కొంది. ఒకవేళ ఆ తీర్పుకు దీనికి వ్యతిరేకంగా వస్తే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారు.

Updated Date - Oct 22 , 2024 | 03:45 AM