Damodar Rajanarasimha: ఫైలేరియా, నులిపురుగుల నివారణపై దృష్టి
ABN , Publish Date - Aug 11 , 2024 | 03:25 AM
ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనక తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనక తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి (స్వతంత్ర) ప్రతాప్ రావు జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ తన కార్యాలయం నుంచి పాల్గొని రాష్ట్రంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణలో ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలలో 14 ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 2600 మంది సిబ్బందిని భాగస్వామ్యం చేశామని, 2522 మంది మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు క్షేత్రస్థాయిలో ఐవర్ మెక్టిన్ మాత్రలను అందజేస్తారని వివరించారు.
అనంతరం ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలపై రూపొందించిన అవగాహన కరపత్రాలను, బ్రోచర్లను ఆవిష్కరించారు. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్‌తో పాటు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ఐవర్ మెక్టిన్ మాత్రలను వేసుకున్నారు.