Shridhar Babu: తెలంగాణపై కేంద్రం పక్షపాతం!
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:34 AM
‘తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర పక్షపాతం చూపుతోంది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. ఇక్కడి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహిస్తున్నారు’ అని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
రూపాయి తీసుకుని పావలానూ ఇవ్వట్లేదు
ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు?
8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది
ఎమ్మెల్యేలకు అడిగే దమ్ము లేదా?: దుద్దిళ్ల
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర పక్షపాతం చూపుతోంది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. ఇక్కడి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహిస్తున్నారు’ అని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌పై లఘు చర్చలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మూసీ నదీ ప్రాజెక్టుకు కేంద్రం సైతం సహకారం అందించగలదని, దీనిపై రాష్ట్ర సీఎం, మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు సిద్ధమైతే తమ పార్టీ ఎమ్మెల్యేలంతా వస్తామన్నారు. దీనికి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. రాష్ట్రం నుంచి కేంద్రం పన్నుల రూపేణా రూపాయి తీసుకుని, తిరిగి మనకు పావలా కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు.
‘కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇక్కడి నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నారు. మొత్తం 8మంది ఎంపీలు, 8మంది ఎమ్మెల్యేలున్నారు. తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని అడిగే దమ్ములేదా?’ అని ప్రశ్నించారు. దీనిపై సభలోని బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 తర్వాత తెలంగాణకు కేంద్రం అందించిన నిధుల లెక్కలు చెప్పేందుకు తాను సిద్ధమని శ్రీధర్ బాబు ప్రకటించారు. 15వ ఆర్థిక సంఘంలోనూ కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా కేటాయించలేదని అంతకుముందు జరిగిన చర్చ సందర్భంగా దానం నాగేందర్ కేంద్రం తీరును తప్పుబట్టారు.