Share News

Government Hospital: సంగారెడ్డిలో 500 పడకలతో ప్రభుత్వ ఆస్పత్రి

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:15 AM

సంగారెడ్డిలో ఐదు వందల పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Government Hospital: సంగారెడ్డిలో 500 పడకలతో ప్రభుత్వ ఆస్పత్రి

  • మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర

  • అక్కడిక్కడే మంజూరు చేసిన మంత్రి

  • నెలాఖరులో లేదా వచ్చే నెలలో శంకుస్థాపనకు హామీ

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 8: సంగారెడ్డిలో ఐదు వందల పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి గురువారం ఆయన సందర్శించారు. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా మరో 500 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విన్నవించగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడిక్కడే ఆస్పత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేసుకుందామని పేర్కొన్నారు.


ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను వినియోగదారుల్లా భావించాలని, ఆస్పత్రి నాది అనుకొని వైద్యులు సేవలందించాలని సూచించారు. అప్పడే సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని చిన్నపిల్లల వార్డులో మరిన్ని వార్మర్లు కావాలని, అదనంగా సీటీ స్కాన్‌తో పాటు ఎంఆర్‌ఐ మిషన్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై కూడా మంత్రి దామోదర సానుకూలంగా స్పందించారు.


నాలుగు నెలల్లో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణం పూర్తి చేసి.. విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి ఆదేశించారు. అంతకుముందు మెడికల్‌ కాలేజీ విద్యార్థులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, డీఎంఈ వాణి, ఆర్‌అండ్‌బీ, టీజీఎంఎ్‌సఐడీసీ అధికారులు ఉన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 03:15 AM