Share News

Telangana: రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ పక్కా..

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:38 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ స్థానాలు సాధించడం పక్కా అని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ హవా స్పష్టంగా కనిపించిందని పేర్కొంటున్నారు. దీంతో పాటు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంతో ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు.

Telangana: రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ పక్కా..

  • లోక్‌సభ సీట్లపై కమలనాథుల ధీమా

  • మోదీ హవా కలిసి వస్తుందని అంచనా

హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ స్థానాలు సాధించడం పక్కా అని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ హవా స్పష్టంగా కనిపించిందని పేర్కొంటున్నారు. దీంతో పాటు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంతో ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు. ‘‘సాధారణంగా పదేళ్లు అధికారంలో ఉన్నపార్టీపై కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ, మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత బదులు సానుకూలత పెరిగింది. అందువల్ల 30-35 శాతం ఓటింగ్‌ మాకు అనుకూలంగా జరిగినట్లు అంచనా వేస్తున్నాం. ఐదేళ్ల కిందట జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 19.6 శాతం ఓట్లు దక్కించుకోగా, ఆరు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 14 శాతం ఓట్లు కైవసం చేసుకుంది.


ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పాలన పట్ల యువత, మహిళలు, విద్యావంతులు గణనీయంగా ఆకర్షితులైనట్లు భావిస్తున్నాం. ఫలితంగా ఓటింగ్‌ శాతం కూడా పెరిగిందని అనుకుంటున్నాం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నవారంతా కాంగ్రె్‌సను ప్రత్యామ్నాయంగా భావించి ఆ పార్టీకి ఓటేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రధానిగా మోదీకి ప్రత్యామ్నాయం అటు కాంగ్రె్‌సగానీ, ఇటు బీఆర్‌ఎ్‌సగానీ కాదని రాష్ట్ర ప్రజలు భావించారు. అందుకే ఏకపక్షంగా మాకు ఓటు వేశారని భావిస్తున్నాం.’’ అని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.


కాంగ్రెస్‌ కంటే మాకే ఎక్కువ సీట్లు: లక్ష్మణ్‌

ఎంపీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ సీట్లు ఖాయమని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. కాంగ్రెస్‌ కంటే తమకే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని చెప్పారు. పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌తో కలిసి లక్ష్మణ్‌.. సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పకపోవచ్చని అన్నారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటూ చేసిన ప్రకటనకు రేవంత్‌ కట్టుబడి ఉండాలన్నారు.


కోడ్‌ ఉల్లంఘన కేసులో.. అమిత్‌ షా, కిషన్‌రెడ్డి పేర్ల తొలగింపు

లోక్‌సభ ఎన్నికల వేళ నమోదైన కేసులో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, కిషన్‌ రెడ్డి పేర్లను హైదరాబాద్‌ పోలీసులు తొలగించారు. హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా మే 1న పాతబస్తీలో నిర్వహించిన సభలో అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను భాగస్వాములను చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌రెడ్డి ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. విచారణ జరపాలని హైదరాబాద్‌ సీపీని ఆదేశించింది. దీంతో మొఘల్‌పురా పోలీసులు అమిత్‌ షా, కిషన్‌రెడ్డి, మాధవీలత, ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు మరికొందరిపై కేసు పెట్టారు. కొద్ది రోజుల క్రితం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు ఈ కేసు నుంచి అమిత్‌ షా, కిషన్‌రెడ్డి పేర్లను తొలగించినట్లు వెల్లడించారు.

Updated Date - Jun 04 , 2024 | 03:38 AM