TG: మత్తు ఇంజెక్షన్లు.. బెల్టు దెబ్బలు..
ABN , Publish Date - May 28 , 2024 | 05:46 AM
ఉపాధి కోసం ప్రైవేటు కన్సల్టెన్సీని ఆశ్రయించి మోసపోయిన తెలంగాణ యువకుడు కాంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నాడు. ప్రస్తుతం కాంబోడియా జైల్లో మగ్గుతున్న ఆ యువకుడి దీన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెలంగాణ వాసి ప్రకాశ్‌కు కాంబోడియాలో చిత్రహింసలు
బయ్యారం, మే 27: ఉపాధి కోసం ప్రైవేటు కన్సల్టెన్సీని ఆశ్రయించి మోసపోయిన తెలంగాణ యువకుడు కాంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నాడు. ప్రస్తుతం కాంబోడియా జైల్లో మగ్గుతున్న ఆ యువకుడి దీన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం మదురైకి చెందిన మున్సిఫ్ రాజు-విజయ దంపతులు దాదాపు 40 ఏళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటకు వలస వచ్చారు. ఆయనకు ఇద్దరు కుమారులు ప్రశాంత్, ప్రకాశ్‌తో పాటు కుమార్తె ఉంది. రాజు ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబ పోషణ నిమిత్తం రాజు రూ.5లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. పెద్ద కుమారుడు ప్రశాంత్ పాపడాలు తయారు చేసి విక్రయిస్తూ కొత్తపేటలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు ప్రకాశ్(25) బీటెక్ చదివి, హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.
నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు వెళ్లే అవకాశం రావడంతో తండ్రి చేసిన అప్పులను తీర్చవచ్చని భావించాడు. అన్ని ఖర్చులూ భరించి ఆస్ట్రేలియా పంపిస్తామని చెప్పిన కన్సల్టెన్సీ నిర్వాహకులు ప్రకాశ్‌ను కాంబోడియాకు తరలించారు. అక్కడ నెల పాటు అంతా సవ్యంగానే సాగినట్లు సమాచారం. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ప్రకాశ్‌ను కంపెనీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. మూడు రోజులకు ఒక్క పూటే భోజనం పెట్టడం, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, బెల్టుతో కొట్టడం ద్వారా చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలిసింది. మోసపోయినట్లు గ్రహించిన ప్రకాశ్ 15 రోజుల క్రితం ఓ వీడియోను కుటుంబ సభ్యులకు పంపాడు. ఇక్కడ ఉండలేనని, త్వరగా తనను తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డాడు. ప్రకాశ్ వీడియోను చూసిన అన్న ప్రశాంత్.. కోయంబత్తూర్‌లోని బంధువులకు విషయాన్ని తెలియజేశాడు. వారు ప్రకాశ్ వివరాలతో కాంబోడియా ఎంబసీ ద్వారా ఆ దేశానికి మెయిల్ చేశారు. అక్కడి పోలీసులు కంపెనీ నిర్వాహకుల చెర నుంచి ప్రకాశ్‌ను రక్షించి జైలులో ఉంచినట్లు తెలిసింది. కాగా, ప్రకాశ్‌ను భారత్‌కు రప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేత రాథోడ్ భాయ్.. కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి సమాచారం అందించారు.