BRS: తండ్రీకొడుకులకు ఝలక్ కేసీఆర్‌పై కేసు!
ABN , Publish Date - Dec 17 , 2024 | 03:07 AM
కేసీఆర్ హయాంలో పదేళ్లపాటు చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలు; ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మద న్ భీంరావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది.
మాజీ సీఎంకు విద్యుత్తు కొనుగోళ్లు, ఒప్పందాల షాక్
కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు క్యాబినెట్ ఓకే
ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలోకి.. చర్చ కూడా
కేసీఆర్ సహా పాత్రధారులపై తీసుకునే చర్యల ప్రకటన
భద్రాద్రి ప్లాంట్‌తో పాతికేళ్లలో రూ.9 వేల కోట్ల భారం
ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రూ.3,642 కోట్ల నష్టం
గనులకు దూరంగా యాదాద్రి.. రవాణాకే 1600 కోట్లు
నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలో పదేళ్లపాటు చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలు; ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మద న్ భీంరావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర పాత్రధారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. సదరు నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న శాసన సభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత.. మాజీ సీఎం కేసీఆర్‌పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపు ఐదు గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్తు కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది.
గత పదేళ్ల కాలంలో కేసీఆర్ డిస్కమ్‌లను ఆర్థికంగా కుప్పకూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్తు సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్తు కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లపాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో రూ.9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడనుందని అభిప్రాయపడింది. సూపర్ క్రిటికల్‌తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్‌లో ప్లాంట్ ఆక్సిలరీ కన్జంప్షన్ (ప్లాంట్ సొంతంగా వినియోగించుకునే కరెంట్), హీట్ రేట్, మెయింటినెన్స్ తదితర ఖర్చులు ఏటా రూ.350 కోట్ల వరకూ అదనంగా పడతాయని, ప్లాంటు జీవిత కాలం 25 ఏళ్లకు దాదాపు రూ.9,000 కోట్ల వరకూ అదనపు భారం పడుతుందని క్యాబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, ఛత్తీ్‌సగఢ్‌తో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంతో రూ.3,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. దీనిపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్‌కు వెళ్లడంతో యూనిట్ కరెంట్ కేరళకు రూ.3.60కే లభించిందని, కానీ, తెలంగాణకు తొలుత రూ.3.90కే యూనిట్ విద్యుత్తు లభించినా ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరిట రూ.4.50; బయటి మార్కెట్లో యూనిట్ ఏడు రూపాయలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని తప్పుబట్టింది. 1000 మెగావాట్ల కరెంట్‌ను తీసుకోవడానికి ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం చేసుకున్నారని, కానీ, ఆ మేరకు ఆ రాష్ట్రం కరెంట్ ఇవ్వలేదని, దాంతో, బహిరంగ విపణి (ఓపెన్ యాక్సె్‌స)లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా, రూ.2,000 కోట్ల అదనపు భారం తెలంగాణపై పడిందని ఆక్షేపించింది.
అలాగే, కరెంట్ కొనుగోళ్లు చేసినా ఛత్తీ్‌సగఢ్‌కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా లేట్ పేమెంట్ సర్‌ఛార్జీ కింద వడ్డీలు/పెనాల్టీల రూపంలో రూ.750 కోట్లు చెల్లింపులు చేస్తున్నారని తప్పుబట్టింది. వెయ్యి మెగావాట్ల తరలింపునకు పవర్ గ్రిడ్‌తో కారిడార్ బుక్ చేసుకున్నారని, ఆ మేరకు తరలించకపోవడంతో రూ.635 కోట్లు చార్జీలు అయ్యాయని తప్పుబట్టింది. మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద రూ.261 కోట్లు పరిహారం కింద చెల్లించాలని పవర్ గ్రిడ్ నోటీసు ఇచ్చిందని (ఈ కేసు అప్పిలేట్ ట్రైబ్యునల్ విచారణలో ఉంది) గుర్తు చేసింది. అలాగే, బొగ్గు గనులకు దూరంగా ప్లాంటును నిర్మించడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. గోదావరి ఒడ్డున బొగ్గు నిల్వలు ఉన్నాయని, పిట్ హెడ్ (బొగ్గు గని ఉపరితల భాగం)లోనే ప్లాంట్లు కట్టాలని, దీనివల్ల విద్యుత్తు ఉత్పత్తి ధర తగ్గుతుందని కేంద్ర విద్యుత్తు అథారిటీ (సీఈఏ) పలు దఫాలుగా గుర్తు చేసిందని, అయినా.. గనులకు సగటున 280 కిలోమీటర్ల దూరంలో (ఇల్లెందు 179 కి.మీ., ఇతర గనులు 360 కి.మీ.) యాదాద్రి నిర్మించడంతో ఏటా రూ.1,600 కోట్లు బొగ్గు రవాణాకే ఖర్చవుతుందని కమిషన్ తేల్చింది. దీనిపైనా క్యాబినెట్ మండిపడింది.
సవాలు విసిరి..
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్తు రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చలో.. విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ సభ్యులు సవాల్ విసిరారు. దాంతో, ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. గత మార్చి 14వ తేదీన జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్‌ను నియమించింది. విచారణ ప్రక్రియ పలు కీలక దశలు దాటి.. త్వరలో నివేదిక ఇస్తారనే క్రమంలో సుప్రీం కోర్టు తీర్పుతో జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి విచారణ ప్రక్రియ నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత జూలై 29న జస్టిస్ లోకూర్ నేతృత్వంలో కమిషన్ వేసింది. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేయనుంది.