Uttam Kumar Reddy: ప్రాజెక్టుల నిర్వహణకు పూడికతీత ఆదాయం
ABN , Publish Date - Aug 20 , 2024 | 03:52 AM
రిజర్వాయర్లు, డ్యామ్‌లలో పేరుకుపోయిన పూడికను ఆదాయ వనరుల కోణంలోనే తీయాలని, ఆ నిధులను ప్రాజెక్టుల నిర్వహణకు వెచ్చించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
ఆదాయ వనరు కోణంలో రిజర్వాయర్లలో పూడికతీత
మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రిజర్వాయర్లు, డ్యామ్‌లలో పేరుకుపోయిన పూడికను ఆదాయ వనరుల కోణంలోనే తీయాలని, ఆ నిధులను ప్రాజెక్టుల నిర్వహణకు వెచ్చించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రాజెక్టుల్లో పూడికతీతపై సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. దీనికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.
పూడికతీత విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్రంలోనూ అనుసరించాలని, దీనికోసం ప్రాజెక్టుల్లో పూడిక ఏ మేరకు ఉందనే అంశంపై శాటిలైట్ చిత్రాలతోపాటు బాతోమేటిక్ అధ్యయనాలతో ఒక అభిప్రాయానికి రావాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఆదాయ సమీకరణ కోణంలోనే టెండర్లు పిలవాలని, ఏకకాలంలో పూడికతీతపై నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించారు. పూడికతీతతో జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పూర్వ దశకు తీసుకెళ్లడం, ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రభుత్వంపై అదనంగా భారం పడకుండా చూసుకోవడం వంటి వాటిపై దృష్టిసారించాలన్నారు.
ఇందుకు రెండు కమిటీలు వేయాలని.. తెలంగాణ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ అధికారులతో ఒక కమిటీని, హైడ్రాలజీ, డ్యామ్ సేఫ్టీ, డిజైన్లకు చెందిన నిపుణులతో అంతర్గత సాంకేతిక కమిటీని వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల్లో పూడికతీతకు పర్యావరణ అనుమతి అక్కర్లేదని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చిన ఉత్తర్వులు, మార్గదర్శకాలకనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. పూడికతీత కాంట్రాక్ట్ ఈపీసీ విధానంలో పిలవాలని, అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచి, పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయించారు. కాగా మానేరు నదిలో ఇసుక తీతపై ఎన్జీటీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం వంటి అంశాలపైనా కమిటీ చర్చించింది.