High Court: సీనియారిటీ దైవాధీనం..!
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:45 AM
దేవాదాయ శాఖలో సీనియారిటీ వ్యవహారం దైవాధీనంగా మారింది. ఈ విషయమై హైకోర్టు ఆదేశాలిచ్చి 9 నెలలైనా.. సీనియారిటీని ఖరారు చేసేవారే కరువయ్యారు.
ఖరారుపై దేవాదాయశాఖలో మీనమేషాలు.. 9 నెలలుగా హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు!
ఆర్జేసీ, డీసీ, ఏసీ క్యాడర్లలో ఖాళీలు
ఈవోలకు అదనపు బాధ్యతలతో అవస్థలు
సీఎం, ఏసీబీకి ఆకాశరామన్న లేఖలు
అక్రమాలపై విజిలెన్స్ నిఘా.. ఫైళ్ల స్వాధీనం
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో సీనియారిటీ వ్యవహారం దైవాధీనంగా మారింది. ఈ విషయమై హైకోర్టు ఆదేశాలిచ్చి 9 నెలలైనా.. సీనియారిటీని ఖరారు చేసేవారే కరువయ్యారు. ఏడాది కాలంగా పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో ఈ శాఖలోని సమస్యలు శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణలతో ఏర్పడే ఖాళీల ఆధారంగా.. అర్హతలున్నవారికి పదోన్నతులు కల్పిస్తారు. దేవాదాయ శాఖలో మాత్రం ఈ విధానాన్ని అవలంబించడం లేదు. దీంతో కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా.. సినియారిటీని ఖరారు చేయాలంటూ ఉత్తర్వులిచ్చింది. ఈ 9నెలల్లో సీనియారిటీ ఖరారుపై ఒక్కటంటే ఒక్కసమీక్ష కూడా జరగకపోవడం గమనార్హం..! ఏడాది కాలంగా ఇన్‌చార్జి కమిషనర్లు మాత్రమే పనిచేయడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈవో, ఏసీ, డీసీ.. అంతా ఇన్‌చార్జులే
ఆదాయ పరంగా అత్యంత కీలకమైన భద్రాచలంతోపాటు.. ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, సికింద్రాబాద్ గణేశ్ ఆలయం.. ఇలా పలు దేవస్థానాల్లో ఖాళీలు ఎక్కువగా ఉండడంతో అన్ని స్థాయుల్లో ఇన్‌చార్జి అధికారులు కొనసాగుతున్నారు. నిజానికి ఈ ఆలయాల్లో డిప్యూటీ కమిషనర్(డీసీ) స్థాయి అధికారి ఈవోగా ఉండాలి. సీనియారిటీ ఖరారు కాకపోవడంతో ఖాళీలు భర్తీ కావడం లేదు. దీంతో.. ఇన్‌చార్జులతో నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి. దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో.. రీజనల్ జాయింట్ కమిషనర్(ఆర్‌జేసీ) పోస్టులో కూడా ఇన్‌చార్జి అధికారే ఉంటున్నారు. నిజానికి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు ఆర్‌జేసీ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పదేళ్లుగా ఈ అంశంపై ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదు.
యాదగిరిగుట్ట ఈవోగా రెవెన్యూ అధికారి
తెలంగాణకే వన్నె తెచ్చేలా పునరుద్ధరించిన యాదగిరిగుట్టతోపాటు.. భద్రాచలం ఆలయాల్లో ఆర్‌జేసీ స్థాయి అధికారి ఈవోగా ఉండాలి. కానీ, పదోన్నతులు లేక.. ఆ క్యాడర్‌లో అధికారులెవరూ లేరు. దీంతో రెవెన్యూ విభాగం నుంచి డిప్యూటీ కలెక్టర్/ఆర్డీవో స్థాయి అధికారిని డిప్యూటేషన్‌పై తీసుకువచ్చి, ఈవోలుగా నియమించారు. సొంత శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సిన చోట.. రెవెన్యూ అధికారులను నియమించి, తమపై పెత్తనానికి నియమించడాన్ని దేవాదాయ శాఖ అధికారులు తప్పుబడుతున్నారు. హైకోర్టు ఆదేశాలున్నా.. సీనియారిటీని ఖరారు చేసి, పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సమీక్ష నిర్వహించాలని ఈవోల సంఘం విజ్ఞప్తి చేసినా.. ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు.
పదోన్నతి ఎదురుచూపుల్లోనే మృతి..!
ఇటీవల కొందరు ఈవోలకు పదోన్నతులు కల్పించేందుకు ఉన్నతాధికారులు జాబితా సిద్ధం చేశారు. అయితే.. ఆలస్యంగా జీవో విడుదలైందని అప్పటికే జాబితాలో పేరున్న నారాయణ అనే అధికారి చనిపోయారని ఉద్యోగులు చెబుతున్నారు.
బదిలీ అయినా అదనపు దూరాభారం
ఒకవేళ ఈవోలను బదిలీ చేస్తున్నా.. వారికి అదనపు/ఇన్‌చార్జి బాధ్యతల నుంచి విముక్తి మాత్రం కల్పించడం లేదు. ఇటీవల హైదరాబాద్ నుంచి బదిలీ అయిన ఈవో.. వందల కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్వేరు జిల్లాల్లోని ఆలయాలకూ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. ఇలాంటి బదిలీలతో తాము మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక పోస్టింగ్‌లు, ‘ప్రత్యేక’ పదోన్నతుల విషయంలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కింది స్థాయిలో బదిలీలు, పదోన్నతుల గురించి పట్టించుకుంటున్న దాఖలాలే కనిపించడం లేదని వాపోతున్నారు. అక్రమ బదిలీలు, పదోన్నతులు, నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల విషయంలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో పలు ఫైళ్లను తీసుకెళ్లారు.