Job Notifications: జూన్‌లో జాబ్‌మేళా..
ABN , Publish Date - Jul 21 , 2024 | 04:00 AM
రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, డిసెంబరులోపు నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌పై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఏటా ఆ నెలలో నోటిఫికేషన్లు.. డిసెంబరులోపు ఉద్యోగాల భర్తీ
జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం
లోపాల్లేకుండా పరీక్షలు, నియామకాలు చేపడతాం
రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపిక కావాలి
అభ్యర్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: రేవంత్
‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ ప్రారంభించిన సీఎం
సివిల్స్ మెయిన్స్ రాసే అభ్యర్థులకు రూ.లక్ష సహాయం
నేడు ఢిల్లీకి రేవంత్.. వరంగల్ సభకు రాహుల్‌కు ఆహ్వానం
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, డిసెంబరులోపు నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌పై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కష్టపడితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల వెన్నుతట్టి అండగా నిలుస్తుందనే సంకేతాలివ్వడానికి, నిరుద్యోగుల్లో నమ్మకం, విశ్వాసం కల్పించడానికే ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్)’ కింద సింగరేణి సంస్థ సమకూర్చిన నిధులతో చేపట్టిన ఈ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.
ఈ పథకం కింద.. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఈ పథకం కింద రూ.లక్ష సహాయాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎ రేవంత్ మాట్లాడుతూ.. సహాయం అందుకునే అభ్యర్థులంతా కచ్చితంగా సివిల్స్‌కు ఎంపికై తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలన్నారు. వెనుకబడిన రాష్ట్రాలుగా పేరున్న బిహార్, రాజస్థాన్ నుంచి అత్యధిక మంది ఐఏఎ్‌సలు ఎంపికవుతారని, ఆ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని రాణించాలని పిలుపునిచ్చారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, బ్యాంకింగ్ నియామకాల్లో బిహార్ రాష్ట్ర అభ్యర్థుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందన్నారు. ‘‘కేంద్ర సర్వీసుల్లో ఉంటే రాష్ట్రానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. మీ గెలుపులో మీ భవిష్యత్తే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది’’ అని సీఎం అన్నారు.
ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం..
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందని, తెలంగాణ పోరాటానికి పర్యాయపదం నిరుద్యోగ సమస్య అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకి చెందిన వేలాది మంది విద్యార్థుల పోరాటంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు. అందుకే తమ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి రాగానే.. ప్రమాణం చేసిన చోటునుంచే 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు.
గత పదేళ్లలో.. ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం నియామకాలు జరగలేదని, యుక్త వయసులో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని, పరీక్షలు రాసి, ఫలితాలు వచ్చేలోపే ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లకు చేరాయని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే టీజీపీఎస్సీని రద్దుచేసి, యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి, నిర్వహణలో లోపాల్లేకుండా పరీక్షలు పెట్టామని వివరించారు. టీజీపీఎస్సీని పునర్‌వ్యవస్థీకరించి, యూపీఎస్సీ తరహాలో మార్పులు చేసి, వెనువెంటనే నోటిఫికేషన్‌లు ఇచ్చామని గుర్తు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పూర్తిచేశామని, 11 వేల ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా విద్యార్థుల విన్నపం మేరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు వాయిదా వే శామని, వచ్చే నవంబరులో వీటిని నిర్వహిస్తామని తెలిపారు.
మెయిన్స్ రాసేవారంతా ఉత్తీర్ణులు కావాలి..
తెలంగాణ బిడ్డలు బాగా మేధస్సు కలిగిన వారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వీరికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం, ఆర్థిక వెసులుబాటు ఇస్తామన్నారు. మెయిన్స్‌కు ప్రిపేర్ కావడానికి వీలుగా ఒక్కొక్కరికి రూ.లక్ష సహాయం అందిస్తున్నామని, మెయిన్స్ రాసేవారంతా తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ సివిల్స్ విజేతలు తమ నడవడికతో పేద వర్గాలకు మేలు చేయాలని, వారి ఆకాంక్షల్ని నెరవేర్చాలని సూచించారు.
కాగా, తాను సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే సమయంలో కోచింగ్ కోసం రూ.2 వేలు లభించక ఇబ్బంది పడ్డానని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం అన్నారు. 50 రూపాయల విలువ చేసే పుస్తకం కొనుక్కునేందుకు వారం రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ సందర్భంగా 2023లో సివిల్స్‌కు ఎంపికైన 41 మంది అభ్యర్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివా్‌సరె డ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు రఘురామిరెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పథకం కింద సహాయం పొందేందుకు ఇవీ అర్హతలు..
జనరల్(ఈడబ్ల్యూఎస్), బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు అర్హులు.
అభ్యర్థులు తెలంగాణ వాసులై ఉండాలి.
యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు పథకానికి అనర్హులు.
అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే పథకం కింద సహాయం పొందడానికి అర్హులు.
సహాయం కోరేవారు సింగరేణి సంస్థ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.