Share News

Medical Colleges: వైద్యకళాశాలల్లో ప్రవేశాలపై టాస్క్‌ఫోర్స్‌

ABN , Publish Date - Aug 17 , 2024 | 03:40 AM

వైద్య కళాశాలల్లో నాణ్యతపై సర్కారు దృష్టిసారించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో వైద్యవిద్యతో పాటు వైద్య సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది.

Medical Colleges: వైద్యకళాశాలల్లో ప్రవేశాలపై టాస్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో నాణ్యతపై సర్కారు దృష్టిసారించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో వైద్యవిద్యతో పాటు వైద్య సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్థు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియను ఈ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షించనుంది.


వైద్యవిద్యా సంచాలకులు ఇందులో సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. డీఎంఈ (అకడమిక్‌), కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌, గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారని జీవోలో సర్కారు పేర్కొంది. కాగా, ఈ నెల 12న ‘వైద్యవిద్య ..నాణ్యత మిథ్య’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో నాణ్యత లోపించిందని, అధ్యాపకుల కొరత ఉందని కథనంలో పేర్కొంది. ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

Updated Date - Aug 17 , 2024 | 03:40 AM