Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు వరల్డ్ బ్యాంక్ నిధులు..
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:25 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నుంచి నిధులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇతర రోడ్ల అభివృద్ధికి కూడా.. దక్షిణభాగం అలైన్‌మెంట్
ఖరారు కోసం రంగంలోకి కమిటీ
స్మార్ట్, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ రోడ్లు
ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్‌స్ట్రక్షన్ విధానంలో నిర్మిస్తాం
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి భేటీ
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నుంచి నిధులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు రాష్ట్రంలోని పలు రహదారుల అభివృద్ధికి కూడా ప్రపంచబ్యాంకు నుంచే నిధులను తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రహదారుల అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరయ్యే జాతీయ రహదారులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం పరిఽధిలో నిర్మించే రోడ్లపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయా రోడ్ల నిర్మాణంతో పాటు, ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక, పూర్తిస్థాయి మరమ్మతులకు పెద్ద ఎత్తున నిధులు అవసరపడుతున్నాయి. నిధుల కోసం నాబార్డు, హడ్కో లాంటి సంస్థలను సంప్రదించాలని సర్కారు భావించినా పలు కారణాల నేపథ్యంలో నిధుల సేకరణకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే తాజాగా రహదారుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులను తీసుకోవాలని ప్రాఽథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంపైనే దృష్టి సారించింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర, దక్షిణభాగాలు నిర్మాణమైతే వాణిజ్య, వ్యాపార రంగంతో పాటు, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తోంది. ఉత్తరభాగం మంజూరై ఏళ్లు గడుస్తున్నా వివిధ కారణాలతో పనులు మందుకు కదలడంలేదు. సంగారెడ్డిలో మొదలై చౌటుప్పల్ వరకు దాదాపు 162 కి.మీ మేర ఉండే ఈ రహదారి నిర్మాణానికి సుమారు రూ.14-15వేల కోట్లు నిధులు అవసరమవనున్నాయి. పరిహారం చెల్లింపునకు రూ.5,200 కోట్ల వరకు నిధులు అవసరపడుతున్నాయి. వీటిలో తన వాటాకింద రూ.2,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను ఒకేసారి బ్యాంకుల ద్వారా రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దక్షిణ భాగం రీజినల్ రింగు రోడ్డును కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించాలనే ఆలోచనలో ఉంది. ఈ భాగం అలైన్‌మెంట్ ఖరారు కోసం ఐఏఎ్‌సలతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. దక్షిణ భాగాన్ని హెచ్‌ఎం (హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్) విధానంలో నిర్మించే అవకాశాలున్నాయి. హెచ్‌ఎం విధానంలో మొత్తం వ్యయంలో నిర్మాణ సంస్థ 40 శాతం, బ్యాంకుల నుంచి రుణంగా 40 శాతం, ప్రభుత్వం మరో 20శాతం భరించాల్సి ఉంటుంది. హైబ్రిడ్ యాన్యునిటీ విధానంలోనైతే రోడ్డు నిర్మాణమయ్యాక వసూలు చేసే టోల్‌లో రాష్ట్రానికి కూడా కొంత వాటా వస్తుంటుంది. ఇందుకు సంబంధించి నిర్మాణానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం టోల్ వసూలు, వాటా ఉంటుంది.
పైగా రహదారి నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థ వెచ్చించిన నిధులను వారికి ప్రభుత్వం వెంటనే చెల్లించాల్సిన అవసరంలేదు. ఏడాదికి కొంత చొప్పున కిస్తీల రూపంలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ విధానంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దక్షిణభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయిస్తే భూ పరిహారంతో పాటు నిర్మాణ విధానాన్ని బట్టి కొంతమేర నిధులను ఆయా నిర్మాణ సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన నిధులను ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటే ఇబ్బందులు ఉండవనే యోచనలో ఉన్నట్టు సమాచారం. కాగా ట్రిపుల్‌ఆర్ దక్షిణభాగం అలైన్‌మెంట్ ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే సమావేశం కానుంది.
రాష్ట్రంలో స్మార్ట్, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ రోడ్లు
రాష్ట్రంలో స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ రోడ్లను నిర్మిస్తామని, ఇందుకు ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్‌స్ట్రక్షన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వంటి ఆధునాతన విధానాలను అనుసరిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అధునాతన రోడ్డు నిర్మాణ పద్ధతులను అనుసరించి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని అన్నారు. సోమవారం సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచబ్యాంక్ రవాణారంగ ప్రధాన అధికారిణి రీనూ అనుజా మాట్లాడుతూ.. ప్రపంచబ్యాంకు సహకారంతో మన దేశంలోని వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న రోడ్ల నిర్మాణాలు, వాటి తీరుతెన్నులపై పీపీటీ రూపంలో మంత్రికి వివరించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్థి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విజన్‌కు అనుగుణంగా అర్బన్ ఏరియాలను.. రుర్బన్‌కు విస్తరించడం, మెగా క్లస్టర్స్ అభివృద్థి, గ్రామీణ ప్రాంతాలను నగరాలతో అనుసంధానించడం, విమెన్ స్కిల్లింగ్ హబ్స్ ఏర్పాటు వంటి నూతన విధానాలను రూపొందించడం ద్వారా రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయవచ్చునని, రాష్ట్రంలో ఇన్నోవేటివ్ ఫైనాన్స్ మోడల్ ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు అనువైన ప్రాజెక్టుల గురించి రీనూ అనుజా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూనే అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందానికి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రామాకేర్ సెంటర్ నిర్మాణంలో ఉందన్నారు తెలంగాణలో రోడ్ల అభివృద్థికి ప్రపంచబ్యాంకు సహకారంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారితో అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడమే తమ లక్ష్యమని.. ప్రత్యేక ప్రణాళికలతో వస్తే మరోసారి సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘ ంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి సూచించారు.