RTC Workers: ‘ఆర్టీసీ విలీనం’పై మంటలు..
ABN , Publish Date - Jul 25 , 2024 | 03:52 AM
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ.. విలీనం ఎప్పుడు? జాప్యానికి కారణమేమిటి?
హరీశ్‌కు మాట్లాడే అవకాశమివ్వాలంటూ పోడియంలోకి బీఆర్‌ఎస్ సభ్యులు
పరిశీలనలో ‘విలీనం’..జాప్యం తలెత్తదు 850 రోజులు సమ్మె చేసినా మీకు పట్టలేదు
ఆర్టీసీని నిర్వీర్యం చేసి.. ఆస్తులను పార్టీ సభ్యులకు కట్టబెట్టింది మీరు: పొన్నం
మీరు చేసిన తప్పులే మమ్మల్నీ చేయమంటారా?: రేవంత్
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఆర్టీసీ ఉద్యోగులు- ప్రభుత్వంలో విలీనం’ అంశాన్ని బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్ లేవనెత్తారు. ఈ సందర్భంగా అధికార, విపక్షసభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతోందని సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారు? జాప్యానికి కారణం ఏమిటి? అని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా విలీనం ప్రస్తావన ఉందనీ గుర్తుచేశారు. అయితే ఆర్టీసీని బీఆర్‌ఎస్ సర్కారు నాశనం చేసిందని, సంస్థ కార్మికుల గురించి మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదని మంత్రి పొన్నం విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యులంతా లేచి నిలబడి, నిరసన వ్యక్తం చేశారు. జోక్యం చేసుకున్న శాసనసభా వ్యవహారాల మంత్రి మంత్రి శ్రీధర్ బాబు.. ప్రశ్నోత్తరాల్లో నిరసన వ్యక్తం చేసే హక్కు సభ్యులకు ఉండదని, రూల్‌బుక్‌లోనూ ఎక్కడా లేదని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఓ దశలో హరీశ్‌కు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని కోరుతూ విపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లారు. చర్చ సందర్భంగా ఆర్టీసీ విలీనంపై జాప్యానికి కారణం ఏమిటి అంటూ విపక్ష సభ్యులు ప్రశ్నించగా ‘ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని పొన్నం బదులిచ్చారు. దీన్ని హరీశ్ తీవ్రంగా ఆక్షేపించారు.
మంత్రి సమాధానం సభను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. యూనియన్‌ల పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారని ప్రశ్నించారు. తమ హయాంలో చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని, అయితే ప్రస్తుతం గౌరవవేతనంతో మూడేళ్లపాటు పనిచే యించుకొని, సంతృప్తి చెందితేనే రెగ్యులరైజ్ చేసేలా నిబంధనలు రూపొందించారని ఆక్షేపించారు. గత ఫిబ్రవరి 10వ తేదీన నెక్లె్‌సరోడ్డులో ఆర్టీసీకి రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా చెక్కును చూపించారని, అది ఇప్పటిదాకా బస్‌భవన్‌కు చేరలేదని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ కింద ఆర్టీసీకి నెలనెలా నిధులు ఇవ్వడం లేదన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం పెరిగిందన్నారు.
ఎన్నికల ముందు విలీనం బిల్లు తెచ్చి..: మంత్రి పొన్నం
పదేళ్లపాటు ఆర్టీసీని నిర్వీర్యం చేసి, అసలు ఆర్టీసీ ఉంటుందా? ఉండదా? అనే పరిస్థితిని కల్పించి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందు యాజమాన్యం, కార్మికులతో కూడా చర్చించకుండా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిందని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదించడం లేదని, రాజకీయ రంగు పులమడానికి కార్మికులను రెచ్చగొట్టి, రాజ్‌భవన్ ముందు ధర్నాలు చేయించారని ఆక్షేపించారు. ఆర్టీసీ ఆస్తులను తమ పార్టీ ప్రతినిధులకు కట్టబెట్టారని, యూనియన్లను రద్దుచేసి, వాటి పునరుద్ధరణ గురించి, మాట్లాడే హక్కు మీకుందా? అని బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ హయాంలో 50 రోజుల పాటు కార్మికులు సమ్మె చేసినా పట్టించుకోలేదని, ఈ రోజు ఆర్టీసీ లాభాలతో నడుస్తోందని పకటించారు. గత పదేళ్లలో ఆర్టీసీ కార్మికులకు చెందిన పీఎఫ్, సీసీఎస్ సొమ్ము రూ.4 వేల కోట్ల నిధులను వాడుకున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా రూ.2 వేల కోట్లను ఆర్టీసీకి ఇచ్చామని, మహాలక్ష్మితో పనిభారం పెరిగినా కార్మికులకు ఓటీ చెల్లించాలని ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 45లక్షల మంది ప్రయాణాలు చేసేవారని, ప్రస్తుతం 56 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.
మీరు చేసిన తప్పులే మమ్మల్ని చేయమంటారా? రేవంత్
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఆంశంపై సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గత సర్కారు ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేసి, కార్మికులు మాట్లాడటానికి వీల్లేకుండా చేసిందని మండిపడ్డారు. అయితే కూనంనేనికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడంపై హరీశ్ అభ్యంతరం వ్యక్తం చేయగా... సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆర్టీసీపై ప్రభుత్వం వివరంగా సమాధానం చెప్పినా సంతృప్తి చెందకుండా పదేళ్లు తాము చేసిన తప్పులే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని బీఆర్‌ఎస్ కోరుకుంటోందని మండిపడ్డారు. కార్మికులను ఆదుకునేందుకు, సంస్థను బతికించుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
అప్పట్లో ఆర్టీసీ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌ను ఎట్లా తొలగించాలో అర్థం కాక ఆర్టీసీలో కార్మిక సంఘాలను నాటి ముఖ్యమంత్రి రద్దుచేశారని, దీనికి ఆ కుటుంబంలో నెలకొన్న అంతర్గత సమస్యలే కారణం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో 50 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారని, 50 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కాగా గోదావరిలో వరదలపై పాల్వాయి హరీశ్ ఇచ్చిన, నిరుద్యోగులకు న్యాయం చేయాలని, మెగా డీఎస్సీ విడుదల చేయాలని కోరుతూ కేటీఆర్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తోసిపుచ్చారు. దాంతో బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని, సభలో నిరసన వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం
వరంగల్ జిల్లా చెన్నూరు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ నెమరు గొమ్ముల సుధాకర్‌రావు, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మహ్మద్ విరాసత్ రసూల్‌ఖాన్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ధర్మపురి శ్రీనివాస్, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమే్‌షరాథోడ్ మృతికి సభ సంతాపంప్రకటించింది. తర్వాత సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు సభ్యులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.