Share News

Hyderabad: డిసెంబరు 9 కటాఫ్‌ తేదీ!

ABN , Publish Date - May 25 , 2024 | 03:51 AM

పంద్రాగస్టును రుణమాఫీకి డెడ్‌లైన్‌గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు.

Hyderabad: డిసెంబరు 9 కటాఫ్‌ తేదీ!

  • అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు దంపతులకు రెండు లక్షలు

  • ఈనెల 19 వరకున్న బకాయిల వివరాల సేకరణ

  • రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రొఫార్మా

  • రుణమాఫీకి సిద్ధమౌతున్నమార్గదర్శకాలు

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టును రుణమాఫీకి డెడ్‌లైన్‌గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు. బ్యాంకుల సిబ్బంది ఇప్పటికే ఆ సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. రుణ మాఫీ పథకానికి డిసెంబరు 9నే కటాఫ్‌ తేదీగా తీసుకొంటుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజు, సోనియాగాంధీ పుట్టిన రోజు అయిన డిసెంబరు 9నే కొత్త ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ తేదీనే కటాఫ్‌ తేదీగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వాలు అమలు చేసిన పద్ధతిలోనే రుణమాఫీ అమలు చేయాలని రేవంత్‌రెడ్డి సర్కారు భావిస్తోంది. కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షల లోపు బకాయిలు ఎంతుంటే అంత మొత్తం మాఫీ చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుంది. మిగతాది చెల్లించాల్సి ఉంటుంది.


రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. భార్య/భర్త పేర్ల మీదున్న అన్ని ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలను క్రోడీకరించి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారు. గత ప్రభుత్వం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీని వర్తింపజేయలేదు. అంతకుముందు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించి మాఫీని అమలు చేసింది. తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫార్మాలో బంగారం రుణాలప్రస్తావన కూడా ఉంది. అంటే, రాష్ట్రంలో రైతులు ఎంతమేర బంగారం తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నారో సమాచారాన్ని సేకరిస్తారు. ఆ రుణభారం సమాచారం కూడా ప్రభుత్వానికి అందనుంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాల ప్రస్తావన లేకపోయినా గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తరహాలో పరిమితులతో ఏమైనా బంగారం రుణమాఫీ చేస్తారేమోనని చర్చ జరుగుతోంది. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ పథకం వర్తించదు.


డిసెంబరు తొమ్మిదో తేదీ కటాఫ్‌

2023 డిసెంబరు తొమ్మిదో తేదీ కటాఫ్‌ తేదీ అయితే అప్పటి వరకు రైతుల పేర్లమీద ఉన్న బకాయిలను మాఫీ చేస్తారు. 2023 డిసెంబరు తొమ్మిదో తేదీ లోపు గత ప్రభుత్వ హయాంలో గత రుణమాఫీ కటాఫ్‌ డేట్‌ తరువాత ఎన్ని పంట రుణాలు తీసుకున్నా అవన్నీ రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తాయి. ప్రొఫార్మాలో మాత్రం 2024 మే 19 వరకున్న బకాయిలు(ఔట్‌ స్టాండింగ్‌ లోన్స్‌) వివరాలను కూడా సేకరించాలని పేర్కొన్నారు. దీంతో 2023 డిసెంబరు తేదీ వరకున్న బకాయులు, 2024 మే 19 తేదీ వరకున్న బకాయుల లెక్కలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.


30 అంశాలతో ప్రొఫార్మా

ప్రొఫార్మాలో నాలుగు విభాగాలు ఉన్నాయి. అవి, పీఏసీఎ్‌సల వివరాలు, బ్యాంకుల వివరాలు, రైతుల వివరాలు, రుణం వివరాలు. రైతుకు సంబంధించి ఇంటిపేరుతో సహా రైతు పూర్తిపేరు, తండి/భర్త పేరు, రైతు ఆధార్‌ కార్డు నెంబరు, మొబైల్‌ నెంబర్‌, స్త్రీయా, పురుషుడా, జనరల్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, చిరునామా సేకరిస్తున్నారు. ఇక నాలుగో విభాగం లో లోన్‌ వివరాలు అడిగారు. కస్టమర్‌ ఐడీ నెంబరు, లోన్‌ అకౌంట్‌ నెంబరు, టైప్‌ ఆఫ్‌ లోన్‌(అగ్రికల్చర్‌ క్రాప్‌ లోన్‌, అగ్రికల్చర్‌ గోల్డ్‌ లోన్‌), ఏ విధమైన అకౌంటు(డీసీసీబీ/సీడెడ్‌ సొసైటీ/బ్యాంకు), క్రాప్‌ లోన్‌ మంజూరైన తేదీ, అప్పు తీసుకున్న తేదీ నుంచి అసలు మొత్తం, వడ్డీ రేటు, 2023 డిసెంబరు 9 వరకు అసలు మొత్తం, వడ్డీ, ఇతర ఛార్జీలు, మొత్తం ఔట్‌ స్టాండింగ్‌ లోన్‌, అదేక్రమంలో 2024 మే 19 తేదీ నాటికి రైతులపై ఉన్న ఔట్‌స్టాండింగ్‌ లోన్ల వివరాలతోపాటు లోన్‌ అకౌంట్‌ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎన్‌పీఏ జాబితాలో పడిపోయిందా? స్టాండర్డ్‌గా ఉందా? రైతు సేవింగ్‌ బ్యాంకు అకౌంట్‌ నెంబరు ఏమిటి? ఐడీ నెంబరు ఏమిటి? తదితర వివరాలను కూడా ప్రొఫార్మాలో అడగటం గమనార్హం.

Updated Date - May 25 , 2024 | 03:51 AM