Share News

Hyderabad: ఏపీ వ్యాపారులతో.. ఏవోల మిలాఖత్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:34 AM

తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు.. మండల వ్యవసాయ అధికారుల(ఏవోల) బ్లాక్‌ మార్కెట్‌ దందాతో ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయి. మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో కొందరు మండల వ్యవసాయ అఽధికారులు.

Hyderabad: ఏపీ వ్యాపారులతో.. ఏవోల మిలాఖత్‌

  • తరలిపోతున్న పచ్చిరొట్ట విత్తనాలు.. రైతుల పేర్లతో వ్యవసాయ అధికారుల వ్యాపారం

  • ఏవోల చేతిలో రైతుల పాస్‌బుక్‌, ఆధార్‌, సెల్‌ నంబర్లు

  • రైతులు తీసుకున్నట్లు లెక్కలు రాసి.. మార్కెట్లో అమ్మకం

  • బ్లాక్‌ మార్కెట్లో సీడ్‌ విక్రయిస్తే కఠినచర్యలు: తుమ్మల

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు.. మండల వ్యవసాయ అధికారుల(ఏవోల) బ్లాక్‌ మార్కెట్‌ దందాతో ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయి. మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో కొందరు మండల వ్యవసాయ అఽధికారులు.. గుంటూరు, విజయవాడ నుంచి వచ్చే వ్యాపారులకు వీటిని దొంగచాటుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్ల సబ్సిడీని భరించి 2 లక్షల టన్నుల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తోంది. ఉదాహరణకు జీలుగ విత్తనాల ధర కిలోకు రూ.93 ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.55.80 సబ్సిడీగా ఇస్తుంది. రైతులు రూ.37.20 చొప్పున చెల్లించాలి. ఎకరానికి 12 కిలోల చొప్పున హెక్టారుకు 30 కిలోల బస్తా ఇవ్వాలనే నిబంధన పెట్టారు. ఈ బస్తా మార్కెట్‌ విలువ రూ.2,790 ఉండగా.. వ్యవసాయ శాఖ ద్వారా రూ.1,116కే రైతులకు సరఫరా చేస్తున్నారు. దాన్ని కొందరు ఏవోలు రూ. 1,500 నుంచి రూ. 1,800 చొప్పున ఏపీ ట్రేడర్లకు అమ్మేస్తున్నారు. పిల్లిపెసర 20 కిలోల బస్తా మార్కెట్‌ ధర రూ.2,710 కాగా.. ప్రభుత్వం సబ్సిడీపై రూ.1,084 చొప్పున పంపిణీ చేస్తున్నారు. జనుము 40 కిలోల బస్తా మార్కెట్‌ రేటు రూ.3,620 కాగా.. సబ్సిడీ రేటు రూ.1,448. వీటిని బ్లాక్‌మార్కెట్లో అమ్మడం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర రైతులకు నష్టం కలుగుతోంది.


  • వారి వద్దే ఐడీ, పాస్‌వర్డ్‌

సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు సంబంధించిన పోర్టల్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌.. ఏవోల వద్ద మాత్రమే ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకం, రైతుల ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబరు పోర్టల్‌లో నమోదు చేసి రైతులకు లెక్క ప్రకారం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలి. అందుకు భిన్నంగా కొందరు మండల వ్యవసాయ అధికారులు(ఏవోలు) వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. రైతులు ఈ సబ్సిడీ విత్తనాల కోసం తమ కార్యాలయానికి రాకపోయినా.. వారి వివరాలన్నీ తమ వద్ద ఉండడంతో ఏవోలు అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుబంధు పథకం అమలు కోసం సేకరించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉండడంతో రైతుల పేర్లమీద ఎంట్రీలు చేసి.. విత్తనాలను ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. ఉదాహరణకు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొర్రూరులో 24 మంది రైతుల పాస్‌పుస్తకాలను పరిశీలిస్తే 14 పుస్తకాల్లో ఫేక్‌ ఎంట్రీలు ఉన్నాయి. అంటే వారు సబ్సిడీ విత్తనాలు తీసుకోకపోయినా.. తీసుకున్నట్లు నమోదుచేశారు. అదే ప్రాంతానికి చెందిన ఒక రైతుకు మామిడి తోట ఉంది. ఆయనకు జీలుగ విత్తనాలు అవసరంలేదు. తీసుకోలేదు కూడా! కానీ ఆయన పేరు మీద కూడా సబ్సిడీ విత్తనాలు తీసుకున్నట్లు నమోదు చేశారు. ఈ దందాపై రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో సోమవారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు. దీంతో కొందరు వ్యవసాయశాఖ అధికారులు.. రైతుల వద్దకు వెళ్లి సబ్సిడీ విత్తనాలు తీసుకున్నట్లు చెప్పాలని వేడుకుంటున్నట్లు సమాచారం.


  • టార్గెట్‌కు అనుగుణంగా..

పచ్చిరొట్ట విత్తనాలు ఎక్కువ మొత్తంలో కొనుగోలుచేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. రాష్ట్ర రైతాంగానికి నష్టం కలిగిస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వ్యవసాయశాఖ అధికారులతోపాటు వివిధ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి, పచ్చిరొట్ట విత్తనాలు మార్కెట్లో అందుబాటు లో ఉన్నాయని, ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ప్రైవేటు వ్యక్తులు, మాయమాటలు చెప్పే వ్యాపారులు, ఆఫర్లు, నజరానాలు ఇచ్చేవారివద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దన్నారు. నాలుగైదు రోజుల్లో టార్గెట్‌కు అనుగుణంగా విత్తనాలు సరఫరా చేస్తామని తుమ్మల తెలిపారు. కంపెనీలతో సమీక్షించి ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన సీడ్‌ ప్యాకెట్లు మూడు రోజుల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 04 , 2024 | 04:34 AM