Share News

Mahesh Kumar Goud: మీ పాలనలోనే రాష్ట్రం వెనకబడింది

ABN , Publish Date - Dec 16 , 2024 | 04:25 AM

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు.. అవాకులు చెవాకులు మాని ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు.

Mahesh Kumar Goud: మీ పాలనలోనే రాష్ట్రం వెనకబడింది

  • హామీలను మరిచి అవినీతికి పాల్పడ్డారు

  • కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు.. అవాకులు చెవాకులు మాని ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. ఈ మేరకు ఆదివారం బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. సెంటిమెంట్‌ పేరుతో రెండు దఫాలు అధికారం చేపట్టిన కేసీఆర్‌.. గడీల పాలన సాగించి ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. ‘ఆనాడు దీక్ష పేరుతో కేసీఆర్‌ ఆడిన నాటకాలు యువత బలిదానాలకు కారణమయ్యాయి. పెట్రోల్‌ డబ్బా.. అగ్గిపుల్లతో డ్రామా ఆడిన హరీశ్‌రావు.. అమాయక యువతను బలిదానాల వైపు ప్రోత్సహించారు? ఇంటికో ఉద్యోగమని యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాక కుటుంబ సభ్యులకు రాజకీయ ఉపాధి కల్పించుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్‌ 54 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది.


ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ లేనంత అవినీతికి కేసీఆర్‌.. ఆయన కుటుంబ సభ్యులు పాల్పడ్డారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను రూ.7 లక్షల కోట్ల మేరకు అప్పుల్లో ముంచేశారు. పదేళ్లు అధికారంలో ఉండి.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు చేయడం.. బీఆర్‌ఎస్‌ దిగజారుడుతనానికి నిదర్శనం. అధికారంలో ఉన్న పదేళ్లు మీడియా సమావేశాల్లో కాకమ్మ కథలు చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఫాంహౌ్‌సకు పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి.. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కేసీఆర్‌కు హితవు పలికారు. మంత్రిగా ఉన్నన్ని రోజులు సినిమాల ఆడియో ఫంక్షన్లకు తప్ప ఒక్కరోజైనా గురుకులాల సందర్శనకు వెళ్లారా అంటూ కేటీఆర్‌ను టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్‌ ఓ ప్రకటనలో నిలదీశారు.


కొత్త కార్యవర్గం నియామకమెప్పుడు?

టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్‌ బాధ్యతలు స్వీకరించి ఆదివారం నాటికి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు గాంధీభవన్‌లో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ పాత కార్యవర్గంతోనే మహేశ్‌ గౌడ్‌ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై అటు అధిష్ఠానంతో.. ఇటు సీఎం, ముఖ్య నేతలతో పలు దఫాలుగా భేటీలు జరిగినా కొలిక్కి రాలేదు. స్థానిక ఎన్నికల్లో మంచి పనితీరు కనపరిచిన వారికే పార్టీ పదవులు దక్కుతాయంటూ అంతర్గత సమావేశాల్లో సీఎం, టీపీసీసీ చీఫ్‌ స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల తర్వాతనే కొత్త కార్యవర్గం ఉంటుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

Updated Date - Dec 16 , 2024 | 04:25 AM