Government Transfers: బదిలీల్లేవ్.. పదోన్నతుల్లేవ్!
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:06 AM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం బదిలీలు జరుగుతున్నాయి. ఈ నెల 31 వరకు వీటిని పొడిగించారు. అయితే ఎక్సైజ్‌శాఖలో మాత్రం వాటి ఊసే లేదు. అధిక ఆదాయం ఆర్జించే శాఖలైన రిజిస్ట్రేషన్, ఆబ్కారీలో వీలును బట్టి బదిలీలు చేసుకునే వెసులుబాటు ఉంది.
ఆదాయం పెరుగుతున్నా.. సిబ్బంది అరకొరే
కొత్త స్టేషన్ల ప్రతిపాదనలూ కాగితాలకే..
సంస్కరణకు దూరంగా ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం బదిలీలు జరుగుతున్నాయి. ఈ నెల 31 వరకు వీటిని పొడిగించారు. అయితే ఎక్సైజ్‌శాఖలో మాత్రం వాటి ఊసే లేదు. అధిక ఆదాయం ఆర్జించే శాఖలైన రిజిస్ట్రేషన్, ఆబ్కారీలో వీలును బట్టి బదిలీలు చేసుకునే వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు కొనసాగుతున్నా.. ఆబ్కారీలో ఆ దిశగా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. చివరిసారిగా ఎక్సైజ్ శాఖలో 2018లో పూర్తిస్థాయి బదిలీలు జరిగాయి. ఆ తర్వాత సాధారణ ఎన్నికల నేపథ్యంలో.. ఒకేచోట మూడేళ్ల పైబడి పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆ శాఖ ఉద్యోగులకు పెద్దఎత్తున స్థానచలనం జరిగింది.
అయితే అవి తాత్కాలిక బదిలీలే కావడంతో మళ్లీ తిరిగి పాత స్థానాలకు పంపి, పాత స్థానాల సర్వీసు సీనియారిటీ ఆధారంగా పూర్తిస్థాయి బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా దంపతుల బదిలీలు ఇతర శాఖల్లో పూర్తవుతున్నా.. ఎక్సైజ్‌లో చేయకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ చెక్ పోస్టులు ఎక్కడెక్కడో సరిహద్దులు, మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి ఉండటంతో అక్కడ ఏడాదిలో బదిలీలు చేపట్టాలి. అయితే ఏళ్ల తరబడి బదిలీలు చేపట్టకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
ఆదాయం సరే.. సంస్కరణలెప్పుడు..?
ఆబ్కారీ శాఖను పాలకులు బంగారు గుడ్లు పెట్టే బాతుగా చూస్తున్నారే తప్ప.. శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. సంస్కరణల అమలుపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ బడ్జెట్‌లో అదనంగా రూ.5 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని ఆబ్కారీ శాఖకు టార్గెట్ పెట్టారు. మద్యం విక్రయాలతోనే ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కారు భావిస్తుంది తప్ప.. సంస్కరణలు అమలుచేసి ఇతర ప్రత్నామ్నాయ మార్గాలు వెతకాలన్న ఆలోచన లేకుండా పోయింది. అబ్కారీ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టాలన్న లక్ష్యంగా గత సర్కారు ఆగస్టు-2020లో జీవో నంబర్ 94 విడుదల చేసింది. దీని ప్రకారం కొత్తగా 14 స్ట్టేషన్లు, 8 చెక్‌పోస్టులు, డిస్టిలరీ, డిపోలు మంజూరు చేసింది.
కొత్తవాహనాలు కొనుగోలుతోపాటు పోస్టింగులకు కూడా అనుమతించింది. కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో రాష్ట్రస్థాయిలో ఒక అదనపు కమిషనర్, మరో జాయింట్ కమిషనర్, 3 డిప్యూటీ కమిషనర్లు, 4 అసిస్టెంట్ కమిషనర్లు, 12 సూపరింటెండెంట్‌లు, 18 ఇన్‌స్పెక్టర్లు, 18 సీనియర్ అసిస్టెంట్‌లు, 19 కానిస్టేబుల్, 25 ఆఫీస్ సూపరింటెండెంట్‌తో పాటు మొత్తం 131 పోస్టులున్నాయి. ఎక్సైజ్ స్టేషన్లను పెంచి అక్రమ మద్యాన్ని నియంత్రిస్తే ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం వస్తుందని గత ప్రభుత్వం భావించింది. అలాగే కొత్త పోస్టులతో పదోన్నతులు వస్తాయని ఇటు ఉద్యోగులూ ఆశపడ్డారు. కానీ ఈ అంశం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.