Tummala Nageshwar Rao: చేనేత వాడుదాం.. నేతన్నకు అండగా ఉందాం
ABN , Publish Date - Aug 08 , 2024 | 03:21 AM
చేనత వస్త్రాలను వినియోగిద్దాం.. నేతన్నలకు అండగా ఉందామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత రంగం అభివృద్ధికి, నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.
జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల పిలుపు
నేతన్న బీమా పథకం ప్రీమియం కింద ఎల్‌ఐసీకి 6 కోట్ల చెక్కు
జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల పిలుపు.. నెక్లస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం
హైదరాబాద్, ఖైరతాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేనత వస్త్రాలను వినియోగిద్దాం.. నేతన్నలకు అండగా ఉందామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత రంగం అభివృద్ధికి, నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల బుధవారం ప్రారంభించారు. 16వ తేదీ వరకు సాగే ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లలోని వస్త్రాలను చూశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో.. నేతన్న బీమా పథకం అమలుకు సంబంధించి 37 వేల మంది చేనేత కార్మికుల బీమా రెన్యువల్‌కు రూ.6 కోట్ల చెక్కును ఎల్‌ఐసీ అధికారులకు అందజేశారు. అలాగే, కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారానికి ఎంపికైన 32 మంది చేనేత కళాకారులు ఒక్కొక్కరికి రూ.25వేల నగదు, ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత వస్త్రాలను ఆదరిస్తామని, వాటిని ధరించి చేనేత కార్మికులకు చేయూత అందిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. చేనేత రంగం అభివృధికి ప్రభుత్వంతో ఓ ప్రణాళికతో ముందుకు వెళుతుందని తెలిపారు. నేత కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు శాశ్వత పథకాల రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు. 2024-25 బడ్జెట్‌లో 36,133 చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేలా రూ.90 కోట్లు కేటాయించామని తుమ్ముల పేర్కొన్నారు. నేతన్నల బీమా కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.15 కోట్లు కేటాయించామన్నారు. నేతన్న డెత్ క్లెయిమ్స్ కింద ఇప్పటివరకు 124 మందికి రూ.6.20 కోట్లను వారి నామినీ ఖాతాలకు బదిలీ చేశామని చెప్పారు.నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.