Share News

Tummala : రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి

ABN , Publish Date - Jul 29 , 2024 | 02:58 AM

ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల డాక్టర్లు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మాటలతోనే రోగులకు సగం రోగం తగ్గిపోవాలని సూచించారు.

Tummala : రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి

  • ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి తుమ్మల తనిఖీ

ఖమ్మం, జూలై 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల డాక్టర్లు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మాటలతోనే రోగులకు సగం రోగం తగ్గిపోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ ఆగస్త్యతో కలిసి ఆదివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణను, వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ మహిళ మంత్రి వద్దకు వచ్చి ఆస్పత్రి సిబ్బంది రోగులతో అగౌరవంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసింది.


స్పందించిన మంత్రి వెంటనే వైద్యాధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేదే పేదలని, అలాంటి వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. రోగులతోపాటు వారి సహాయకులుగా వచ్చేవారికీ మర్యాద ఇవ్వాలన్నారు. వారం రోజుల్లోగా ఆస్పత్రి తీరు మారాలని, ఆవరణ అంతా శుభ్రం చేయాలని అధకారులను ఆదేశించారు. అనంతరం మంత్రి తుమ్మల విలేకరులతోనూ మాట్లాడుతూ ఖమ్మం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు. ఇందుకోసం కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని రప్పించి ఈ ఆస్పత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిపిస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Jul 29 , 2024 | 02:58 AM