Share News

Admissions: బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు ఎప్పుడు?!

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:44 AM

నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ) ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సెట్‌) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆ ఊసే ఎత్తడం లేదు.

Admissions: బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు ఎప్పుడు?!

  • ఎంసెట్‌లో ఆప్షన్‌ లేదు.. సెట్‌ లేదు

  • నిర్వహణపై వైద్యారోగ్య శాఖ మౌనం

  • ప్రవేశాలకు ప్రాతిపదికపై స్పష్టత కరువు

  • ప్రభుత్వం వైపు కాళోజీ వర్సిటీ చూపు

వరంగల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ) ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సెట్‌) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆ ఊసే ఎత్తడం లేదు. కనీసం ఎంసెట్‌(ఈఏపీ సెట్‌)లో కూడా ఆ ఆప్షన్‌ ఇవ్వలేదు. ప్రవేశాలను ఎంసెట్‌ మార్కుల ఆధారంగా చేపడతారా? లేదా ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగానా? అన్నదీ స్పష్టత లేదు.


రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ తర్వాత నర్సింగ్‌ కోర్సులకే డిమాండ్‌ ఉంది. 112 బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలలో 6,720 సీట్లు ఉన్నాయి. గతంలో ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా ఆగస్టు నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చి సెప్టెంబరులో ప్రవేశాలు ప్రారంభించేవారు. మూడు, నాలుగు విడతల్లో కౌన్సెలింగ్‌ పూర్తి చేసేందుకు డిసెంబరు, జనవరి దాకా గడువు పొడిగిస్తూ అడ్మిషన్లు ఇచ్చే వారు. 2023-24 నుంచి సెట్‌ ర్యాంకుల ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని ఐఎన్‌సీ సూచించింది.


కానీ, రాష్ట్రంలో ఎలాంటి సెట్‌ను నిర్వహించలేదు. ఎంసెట్‌లోనే ఆప్షన్‌ ఇచ్చి, ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించారు. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే కన్వీనర్‌ కోటాలో అడ్మిషన్లు ఇచ్చారు. యాజమాన్య కోటా సీట్లకు మాత్రం నీట్‌ మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో చాలామంది పేద విద్యార్థులు నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలు పొందలేకపోయారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది ఎంసెట్‌ (ఈఏపీ సెట్‌)లో నర్సింగ్‌ కోర్సుకు ఆప్షన్‌ ఇవ్వలేదు. జూన్‌ 15వ తేదీలోగా సెట్‌ నిర్వహించాలని ఐఎన్‌సీ సూచించినా.. మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది.


  • సందిగ్ధంలో కాళోజీ హెల్త్‌వర్సిటీ

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో నీట్‌ ర్యాంక్‌ల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయి. నర్సింగ్‌లో ఏ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించాలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వెళ్తామని కాళోజీ హెల్త్‌ వర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది ప్రవేశాలకు రెండు రకాల నిబంధనలు విధించారనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా సెట్‌ నిర్వహించలేకపోయింది. ఇప్పటికిప్పుడు సెట్‌ నిర్వహిస్తుందా? లేదా పాత పద్ధతిలోనే మళీ ప్రవేశాలు కల్పిస్తుందా? అనే ఆందోళనలో విద్యార్థులున్నారు.

Updated Date - Aug 23 , 2024 | 03:44 AM