Komatireddy Venkat Reddy: ఏడాదిన్నరలోగా ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి
ABN , Publish Date - Aug 05 , 2024 | 04:59 AM
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పాత కాంట్రాక్టును రద్దు చేసి, దసరాలోగా కొత్త టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
పాత కాంట్రాక్టు రద్దు చేసి.. దసరా నాటికి కొత్త టెండర్
ఆరేళ్లలో పూర్తి చేయలేకపోయిన బీఆర్‌ఎస్‌కు సిగ్గుండాలి
మరో 15 ఏళ్లు మాదే అధికారం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఉప్పల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పాత కాంట్రాక్టును రద్దు చేసి, దసరాలోగా కొత్త టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడామని, ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పరిష్కారం చూపుతానన్నారు. ఆదివారం ఈ కారిడార్ పనులను పరిశీలించారు. మేడిపల్లి సీపీఆర్‌ఐ జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల అధికారులతో సమీక్షించారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా పనుల్లో జాప్యం జరిగిందని, కాంట్రాక్టర్ల మీద తోసివేయడానికి వీల్లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనా వ్యయం రూ.300 కోట్లు పెరిగినా సరే కొత్త టెండర్ వేసి ఈ కారిడార్‌ను 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇది పూర్తయితే గంటన్నరలో వరంగల్ వెళ్లవచ్చన్నారు. 6 కి.మీ. ఈ కారిడార్‌ను ఆరేళ్లలో కూడా పూర్తిచేయలేకపోయారని, అందుకు పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.
అసెంబ్లీకి రానందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు తాము అధికారంలోకి వచ్చాక వడ్డీ రూ.7 వేల కోట్లతో పాటు అసలు కలిపి రూ.47 వేల కోట్లు చెల్లించామన్నారు. ప్రస్తుతం అన్ని సంక్షేమ కార్యక్రమాలకు అవుతున్న ఖర్చు రూ.36 వేల కోట్లు మాత్రమేన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని, మరో 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 చేరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.