Uttam Kumar Reddy: కాళేశ్వరం కట్టినప్పుడు కూలినప్పుడు అధికారంలో మీరే..
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:45 AM
‘‘కాళేశ్వరం కట్టినప్పుడు.. కూలినప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే? కూలినప్పుడు కూడా వారే అధికారంలో ఉన్నారు. రీ-డిజైనింగ్, రీ-ఇంజనీరింగ్‌తోనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది.
మేడిగడ్డలో నీళ్లు లిఫ్ట్‌చేసి ఎక్కడ పోయాలి?
మీ నెత్తిల పోయాల్నా?: మంత్రి ఉత్తమ్
ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో దోపిడీ చేసి.. మాపై నిందలేస్తారా?
మేడిగడ్డను నింపితే 44 గ్రామాలు, లక్షల ఎకరాలకు ముంపు ముప్పు
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే గేట్లు ఎత్తినం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, జులై 28 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం కట్టినప్పుడు.. కూలినప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే? కూలినప్పుడు కూడా వారే అధికారంలో ఉన్నారు. రీ-డిజైనింగ్, రీ-ఇంజనీరింగ్‌తోనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరానికి మేడిగడ్డ గుండెకాయ అని చెప్పిన మీరు.. ఆ గుండెకాయ కుంగినపుడు అధికారంలో ఉండి ఏంచేశారు? వాస్తవాలను వక్రీకరించటం గులాబీ దండుకు వెన్నతో పెట్టిన విద్య!’’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దోపిడీ చేసింది కాకుండా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, మంత్రుల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం జలసౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబం కమీషన్ల కక్కుర్తి కోసం రాష్ట్ర నీటిపారుదలరంగాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. ‘‘మాజీ మంత్రి కేటీఆర్‌కు సిగ్గు, అవగాహన, ఇంగిత జ్ఞానం లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ.. ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంలో జోసెఫ్ గోబెల్స్‌ను కేటీఆర్ మించిపోయారు. ఆయనను కేటీ రామారావు అని కాకుండా.. జోసెఫ్ గోబెల్స్ రావు అని పిలిస్తే సరిగ్గా సరిపోతుంది’’ అంటూ మండిపడ్డారు.
ప్రాణహిత-చేవెళ్లను కాదని..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగిస్తే రూ.38,500 కోట్లతో పూర్తయ్యేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘‘ప్రాణహిత-చేవెళ్లకు కరెంటు చార్జీ లు ఏటా రూ.1000 కోట్లలోపు ఉండేవి. ఇప్పుడు కాళేశ్వరానికి మాత్రం ఏడాదికి రూ.10వేల కోట్లు కట్టాల్సి వస్తోంది. ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి రూ. 1.47 లక్షల కోట్ల ఖర్చు వస్తుంది. అసలు, వడ్డీ, కరెంటు బిల్లులు కలిపి ఏడాదికి రూ.35 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. డిజైన్ మార్చేసి.. తుమ్మిడిహెట్టిలో 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ, నీళ్లులేవని అబద్ధాలు చెప్పి మేడిగడ్డకు షిఫ్ట్ అయ్యారు. లక్ష కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లతో వేసిన కమిటీ.. మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించొద్దని లిఖిత పూర్వకంగా నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. రికార్డులు, నివేదికలను మార్చేశారు. లోపభూయిష్టమైన డిజైన్, నిర్మాణం, ప్రణాళిక, నిర్వహణతో ప్రాజెక్టు నిర్మించారు. సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పునాది నుంచే లోపాలు జరిగాయి. ఎక్కువ వడ్డీకి స్వల్ఫకాలిక రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు.
ఇప్పుడీ ఆర్థిక భారాన్ని తెలంగాణ ప్రజలు శాశ్వతంగా భరించాల్సి ఉంటుంది. ఈ తరమే కాదు.. ముందు తరాలను కూడా తాకట్టు పెట్టారు’’ అని ఉత్తమ్ విమర్శించారు. కేటీఆర్ అధికారాన్ని కోల్పోయిన ఫ్రస్టేషన్‌తో నాన్‌సెన్స్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ జరుగుతోందని, దోషులు ఎవరైనా వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. 2019 నుంచే అన్నారం, సుందిళ్లలో బుంగలు, సీపేజీలు, లీకేజీలున్నాయని నీటి పారుదలశాఖ అధికారులు ఎల్‌అండ్‌టీకి లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ అంశంపై అధికారులు-ఎల్‌అండ్‌టీకి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. విద్యుత్తు బిల్లుల కోసం మేడిగడ్డలో పంపింగ్ నిలిపివేశారని కేటీఆర్ మాట్లాడడాన్ని తప్పుబడుతూ.. నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ పోయాలి? మీ నెత్తిల పోయాల్నా? అని ప్రశ్నించారు. 16 టీఎంసీలను నిల్వచేస్తే చాలా ప్రమాదం జరుగుతుందన్నారు. ఏటూరు నాగారం మొదలుకొని 44 గ్రామాలు, భద్రాచలం పట్టణం, భద్రాద్రి రామాలాయం, సీతారామా ప్రాజెక్టు, సమ్మక్క-సారలమ్మ బ్యారేజీ, దుమ్ముగూడెం ఆయకట్టు అన్నీ కొట్టుకపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏటా ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు
ఏటా 6.50 లక్షల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 36లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఉత్తమ్ వివరించారు. ఆదివారం ఆయన జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 10,820 కోట్లు కేటాయించామని, ఏటా 6.50 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ‘‘గోదావరి బేసిన్‌లో ఉన్న చిన్న కాళేశ్వరం, మొడికుంట వాగు, లోయర్ పెన్‌గంగ, చనాకా-కొరాటా, శ్రీపాద ఎల్లంపల్లి, సీతారామ, దేవాదుల, కృష్ణా బేసిన్‌లోని కోయిల్ సాగర్, రాజోలిబండ, కల్వకుర్తి, డిండి, ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీ, జవహార్‌లాల్ నెహ్రూ నెట్టెంపాడు ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేస్తాం. దీంతో 5,84,770 ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని ఉద్ఘాటించారు. నాణ్యతతో పనులు చేయించే అధికారులను గుర్తిస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.