Share News

మరో రియల్‌ బూమ్‌ రాబోతోంది

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:53 AM

తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతుందని, దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

మరో రియల్‌ బూమ్‌ రాబోతోంది

  • నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు అండగా ఉంటాం

  • హైదరాబాద్‌ దక్షిణంవైపూ అభివృద్ధికి ఫ్యూచర్‌ సిటీ

  • ‘క్రెడాయ్‌ స్టేట్‌కాన్‌’లో మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతుందని, దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. క్రెడాయ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో మంగళవారం నిర్వహించి స్టేట్‌కాన్‌-2024ను మంత్రులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ తాము తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మరో బూమ్‌ రాబోతోందన్నారు. నిర్మాణ రంగంలోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తోందన్నారు. ముచ్చెర్ల వద్ద ఫ్యూచర్‌ సిటీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ, మెట్రో రైల్‌ విస్తరణ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులు సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణలో పట్టణీకరణ వేగవంతంగా జరుగుతోందని, ఇప్పటికే 45 శాతం పట్టణ ప్రాంతాలుగా మారాయన్నారు. వ్యాపార వృద్ధికి తోడ్పడటానికి ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడుతూ పారదర్శక పాలన, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందిస్తుందన్నారు. 8 నెలల్లో తమ ప్రభుత్వ పనితీరుతో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు.


పెట్టుబడులకు హైదరాబాద్‌ ‘గ్లోబల్‌ డెస్టినేషన్‌’గా మారుతుందన్నారు. నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చెయ్యకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హైటెక్‌ సిటీని చంద్రబాబు తీసుకొస్తే ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట విస్తరణకు వైఎస్సార్‌ కారణమన్నారు. హైదరాబాద్‌ చుట్టూ అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే ఓఆర్‌ఆర్‌ నిర్మించామని, త్వరలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు పునాది వేస్తామన్నారు. హైదరాబాద్‌ దక్షిణంవైపు కూడా అభివృద్ధి చేసేందుకు ఫ్యూచర్‌ సిటీ రాబోతోందని, అహ్మదాబాద్‌ తరహాలో పెద్ద క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు.

గత ప్రభుత్వంలో రాజు, యువరాజులదే అధికారమని, అప్పటి మంత్రులకు అధికారం లేదన్నారు. క్రెడాయ్‌ తెలంగాణ చైర్మన్‌ మురళీకృష్ణా రెడ్డి, అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌ రెడ్డి రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.

వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. సీబీఆర్‌ఐ భాగస్వామ్యంతో ‘తెలంగాణ- గోయింగ్‌ గ్లోబల్‌’ నివేదికను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి, క్రెడాయ్‌ కార్యదర్శి రాంరెడ్డి, రామచంద్రారెడ్డి, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 03:53 AM