TG: వేలకోట్ల పెట్టుబడులు తీసుకొస్తాం
ABN , Publish Date - May 18 , 2024 | 04:53 AM
నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో మూసీ అభివృద్ధి
మెట్రో ప్రాజెక్టును విస్తరిస్తాం: ఉత్తమ్, శ్రీధర్‌బాబు
హైదరాబాద్ సిటీ, మాదాపూర్, మే 17 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ మహానగర రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదపడేవిధంగా మెట్రో రైలును శివారు ప్రాంతాలకు విస్తరిస్తామని, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ (ఐజీబీసీ) ప్రాపర్టీ షోను శుక్రవారం మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరితభవనాల అవసరం చాలా ఉందన్నారు.
గ్రీన్ బిల్డింగ్ పద్ధతి రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని, ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్త పాలసీలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళుతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఐటీ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, దీనివల్ల ఉద్యోగాలతో పాటు పరోక్షంగా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.