Share News

Warangal: కాకతీయ వర్సిటీ వీసీ రమే్‌షపై విజిలెన్స్‌ విచారణ

ABN , Publish Date - May 19 , 2024 | 03:56 AM

కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ తాటికొండ రమే్‌షపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల నుంచి టెర్మినేట్‌ చేసిన బోధనా సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి తీసుకోవడం, అక్రమ బదిలీలు, నియామకాలు, నకిలీ ప్రాజెక్టులు ఆమోదించి అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు గతంలో అనేకసార్లు ఆరోపించారు.

Warangal: కాకతీయ వర్సిటీ వీసీ రమే్‌షపై విజిలెన్స్‌ విచారణ

  • ఆదేశించిన ప్రభుత్వం

  • అవినీతి, వర్సిటీ భూముల అన్యాక్రాంతం, అక్రమ పోస్టింగ్‌లపై ఆరోపణలు..

  • ఆంధ్రజ్యోతి కథనాలు,

  • అకుట్‌ ఫిర్యాదుతో స్పందించిన ప్రభుత్వం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి), వరంగల్‌ ఎడ్యుకేషన్‌, మే 18: కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ తాటికొండ రమే్‌షపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల నుంచి టెర్మినేట్‌ చేసిన బోధనా సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి తీసుకోవడం, అక్రమ బదిలీలు, నియామకాలు, నకిలీ ప్రాజెక్టులు ఆమోదించి అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు గతంలో అనేకసార్లు ఆరోపించారు. అలాగే యూనివర్సిటీ భూముల అన్యాక్రాంతం, అక్రమ పోస్టింగ్‌లపై ఆరోపణలు రావడం, ఆంధ్రజ్యోతిలో కథనాలు, అసోసియేషన్‌ ఆఫ్‌ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్‌ (అకుట్‌) ఫిర్యాదుతో ప్రభుత్వం వీసీ రమే్‌షపై చర్యలకు ఉపక్రమించింది.


‘అంధ్రజ్యోతి’లో మార్చి 23న ‘అక్రమాలకు కేరాఫ్‌ కేయూ’, ఏప్రిల్‌ 6న ‘కేయూ కబ్జాలపై చర్యలేవి’, మే 17న ‘కేయూ ప్రక్షాళన జరిగేనా’ తదితర కథనాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ నుంచి సమాచారం సేకరించింది. వర్సిటీలోని అకుట్‌తోపాటు వివిధ అధ్యాపక సంఘాలు వీసీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో స్పందించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వీసీపై వస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా వెంకటేశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని వీసీ రమేష్‌ స్వాగతించారు. గత మూడేళ్ల పదవీకాలంలో వర్సిటీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని, న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించడతోపాటు 300మందికిపైగా పీహెచ్‌డీ ప్రవేశాలు పూర్తి చేశామన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు రావాల్సిన అన్నిరకాల బకాయిలు విడుదల చేశానని తెలిపారు. వర్సిటీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేశారన్నారు. ప్రభుత్వ విచారణను ఆహ్వానిస్తున్నానని తెలిపారు.

Updated Date - May 19 , 2024 | 03:56 AM