Telangana Politics: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి అతనేనా?
ABN , Publish Date - Apr 10 , 2024 | 11:55 AM
వరంగల్(Warangal) లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్(BRS) అన్వేషణ సాగిస్తోంది. కాంగ్రెస్(Congress), బీజేపీలకు(BJP) దీటుగా నిలబడే బలమైన అభ్యర్థి కావాలంటూ అధిష్ఠానం ఆశావహుల జాబితాను వడపోస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తొలుత కడియం కావ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసినా.. అనూహ్యంగా ఆమె బీఆర్‌ఎ కు రాజీనామా చేసి..
వరంగల్, ఏప్రిల్ 10: వరంగల్(Warangal) లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్(BRS) అన్వేషణ సాగిస్తోంది. కాంగ్రెస్(Congress), బీజేపీలకు(BJP) దీటుగా నిలబడే బలమైన అభ్యర్థి కావాలంటూ అధిష్ఠానం ఆశావహుల జాబితాను వడపోస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తొలుత కడియం కావ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసినా.. అనూహ్యంగా ఆమె బీఆర్‌ఎ కు రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగటంతో గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో వరంగల్ ఓటర్లలో గట్టి పట్టున్న నేతను బరిలో దించాలని ఆ పార్టీ యోచిస్తోంది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కేటీఆర్, హరీశ్‌రావు సేకరించారు. వీరి నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకా రం ఓ నివేదిక తయారు చేసి సోమవారమే పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించినట్టు తెలిసింది. దీంతో ఒకటిరెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక నాగూర్‌కర్నూల్ సీటు మాదిగ సామాజిక వర్గానికి, పెద్దపల్లి సీటు మాల సామాజిక వర్గానికి బీఆర్‌ఎస్ కేటాయించింది. దీంతో వరంగల్ సీటును మాదిగ సామాజిక వర్గం నేతకే ఇవ్వాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. ఇప్పటికే తనతో టచ్‌లో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను తెరపైకి తీసుకొచ్చేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లను కూడా కలిసి పోటీకి అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం రాజయ్య విషయంలో వేచి చూద్దామంటూ దాటవేసినట్టు సమాచారం. దీంతో ప్రత్యామ్నాయంగా హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, జనగామకు చెందిన ప్రముఖ వైద్యుడు సుగుణాకర్‌రాజు, కేయూ ఉద్యోగి పుల్లా శ్రీను, బోడా డిన్నా తదితర పేర్లను పరిశీలిస్తున్నారు.
మాదిగ సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్ధి లేకపోతే మాల సామాజిక వర్గం నుంచి పరిశీలించాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ సామాజిక వర్గానికి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పోటీకి సుముఖంగా ఉన్నట్లుగా సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు పలువురు పెద్ది స్వప్న పేరును సూచిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమకారుల కోటా నుంచి మాల సామాజిక వర్గం నేతలు జోరిక రమేశ్, నటరాజ్, సిరిమిల్ల సదానం తదితరులు కూడా ఎంపీ టికెట్ కోసం క్యూ కడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించిన కడియం కావ్య, అరూరి రమేశ్ ఇద్దరు కూడా గులాబీ వలస నేతలే కావటంతో బీఆర్‌ఎస్‌కు వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి లేకుండా పోయారు.