Share News

KTR: ఉన్న వాటికే కాదు.. పాత వాటికీ పాతర వేశారు: కేటీఆర్..

ABN , Publish Date - Nov 10 , 2024 | 04:26 PM

కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 34 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. చేతి వృత్తుల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చిందని మండిపడ్డారు.

KTR: ఉన్న వాటికే కాదు.. పాత వాటికీ పాతర వేశారు: కేటీఆర్..
BRS Working President KTR

హనుమకొండ: బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది కిందట కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని, కానీ ఇప్పటివరకూ ఎందుకు అమలు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆయన మండిపడ్డారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. " బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త జపాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నారు. కులగణన కోసం వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తెలంగాణలో బీసీ కులగణన చేస్తున్నారు. కులగణన పేరుతో ప్రజల్ని మోసం చేసే కుట్ర జరుగుతోంది. బీసీలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. బలహీన వర్గాలకు రేవంత్ రెడ్డి బలమైన వెన్నుపోటు పొడిచారు. కులగణనను స్వాగతిస్తున్నాం.. కానీ దానిపై అనుమానాలు ఉన్నాయి. కులగణనలో ఆర్థిక, రాజకీయపరమైన ప్రశ్నలు తొలగించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీ శాఖ పెట్టలేదు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక శాఖ ఉండాలని కేటీఆర్‌ ఎప్పుడో చెప్పారు.


కాంగ్రెస్ పాలనలో 34 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేతి వృత్తుల వారికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యేలపై దాడులు చేయడం ఆపాలి. రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఈ ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారు. మీ హామీలే పాములై మెడకు చుట్టుకుంటాయి. హామీలు విస్మరిస్తే ప్రజలే మిమ్మల్ని మళ్లీ రోడ్డుపై నిలబెడతారు. అధికారం చేపట్టి సంవత్సరమైనా మంత్రివర్గం పూర్తిగా నింపలేని అసమర్థుడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రైతుబంధు, దళితబంధు వంటి అనేక పథకాలు ఆగిపోయాయి. కొత్త పథకాలు కాదు.. ఉన్న పథకాలకే పాతర వేశారు" అని మండిపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Harish Rao: అందుకే మహారాష్ట్రాలో పోటీ చేయట్లేదు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

CM Revanth Reddy: పాలమూరుని అభివృద్ధి చేసుకోనివ్వండి

Updated Date - Nov 10 , 2024 | 04:29 PM