Share News

TG News: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మెరిట్ లిస్ట్ రేపే విడుదల..

ABN , Publish Date - Sep 24 , 2024 | 08:42 PM

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

TG News: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మెరిట్ లిస్ట్ రేపే విడుదల..

వరంగల్: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఉదయం మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం తుది మెరిట్ లిస్టు విడుదల చేస్తామని వీసీ వెల్లడించారు. అదే రోజు(గురువారం) నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని కరుణాకర్ రెడ్డి సూచించారు. గత‌‌ సంవత్సరానికి సంబంధించిన కాలేజీల వారీ సీట్ల అలా‌ట్‌మెంట్ వివరాలు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిని పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకుంటే, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభం అవుతుందని వీసీ కరుణాకర్ రెడ్డి విద్యార్థులకు తెలిపారు.


సుప్రీంకోర్టుకు చేరిన వివాదం..

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి రంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జారీ చేసిన జీవో 33పై 135మంది విద్యార్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానికత విషయమై వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే ఇస్తూ 135మంది కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ గత శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.


మెుత్తం సీట్లు ఇవే..

తెలంగాణలో 34 ప్రభుత్వ, 30 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటిలో కన్వీనర్‌ కోటాలో 5,798సీట్లు ఉండగా.. మేనేజ్‌మెంట్‌ కోటాలో 1,955ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే మేనేజ్‌మెంట్‌ సీట్లకు 6,468మంది, కన్వీనర్‌ కోటా సీట్లకు 17,654మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీటితోపాటు కోర్టును ఆశ్రయించిన 135మంది అడ్మిషన్లకు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటికే జాతీయ కోటా కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 647సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది నీట్‌-యూజీ పరీక్షను 77,849మంది రాయగా వారిలో 47,356మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడంతో 400సీట్లు అదనంగా పెరిగాయి.

Updated Date - Sep 24 , 2024 | 09:07 PM