Share News

Mancherial: స్టాక్‌మార్కెట్‌లో నష్టాలతో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:47 AM

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి ఉన్నతమైన జీవితం గడపాలని ఆశించిన ఓ యువకుడు అప్పులు చేసి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు.

Mancherial: స్టాక్‌మార్కెట్‌లో నష్టాలతో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య

  • లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక బలవన్మరణం

శ్రీరాంపూర్‌, ఆగస్టు 24 : తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి ఉన్నతమైన జీవితం గడపాలని ఆశించిన ఓ యువకుడు అప్పులు చేసి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. చివరికి చేసిన అప్పులు తీర్చలేక, లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌కు చెందిన శ్రీకాంత్‌ (29) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. దానికంటే ముందు తన ఆత్మహత్యకు కారణం చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.


అరుణక్కనగర్‌కు చెందిన నామ్తాబాజీ రాములు పెద్ద కుమారుడు శ్రీకాంత్‌కు భార్య శృతి, 8నెలల కుమారుడు ఉన్నారు. మంచిర్యాలలో సెల్‌ పాయింట్‌ నిర్వహించే శ్రీకాంత్‌ కుటుంబసభ్యులకు తెలియకుండా ఏడాదిగా స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తున్నాడు. తెలిసిన వారు, బంధువుల వద్ద నుంచి రూ.5 లక్షలు, వేర్వేరు లోన్‌ యాప్‌ల ద్వారా మరో రూ.2లక్షలు అప్పు తెచ్చి షేర్‌ మార్కెట్‌లో పెట్టి నష్టపోయాడు.


లోన్‌యా్‌పలకు క్రమం తప్పకుండా వాయిదా(ఈఎంఐ)లు చెల్లించిన శ్రీకాంత్‌ ఆగస్టు నెలకు సంబంధించిన చెల్లింపులు చేయలేకపోయాడు. దీంతో ఆయా యాప్‌ల నిర్వాహకులు వేధింపులకు దిగగా వాటిని తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అప్పుల వాళ్లు తన కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్న శ్రీకాంత్‌ తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. శ్రీకాంత్‌ భార్య శృతి పుట్టింటిలో ఉండగా ఆమె చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Aug 25 , 2024 | 04:47 AM