TG: రాజధానిలో కనిపించని యూత్ జోష్!
ABN , Publish Date - May 14 , 2024 | 04:58 AM
ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం విస్తృతంగా చేసిన ప్రచారం, స్వచ్ఛందసంస్థలు జరిపిన ర్యాలీలు, సెలబ్రిటీల సూచనలు... ఏవీ హైదరాబాద్ యువ ఓటర్లను కదిలించలేదు. చాలా వరకూ పోలింగ్ స్టేషన్లలో సగటున పది ఓట్లలో 1-2 మాత్రమే తొలి లేదా రెండవసారి (గత అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఓటు వేసిన వారు) ఓటు వేస్తున్న నవతరం కనిపించింది.
హైదరాబాద్ సిటీ, మే 13 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం విస్తృతంగా చేసిన ప్రచారం, స్వచ్ఛందసంస్థలు జరిపిన ర్యాలీలు, సెలబ్రిటీల సూచనలు... ఏవీ హైదరాబాద్ యువ ఓటర్లను కదిలించలేదు. చాలా వరకూ పోలింగ్ స్టేషన్లలో సగటున పది ఓట్లలో 1-2 మాత్రమే తొలి లేదా రెండవసారి (గత అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఓటు వేసిన వారు) ఓటు వేస్తున్న నవతరం కనిపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాలలో హోరెత్తిన యువత సెల్ఫీలు ఈసారి పెద్దగా లేవు.
విచిత్రం ఏమిటంటే, ఈసారి రాష్ట్రంలో తొలిసారి ఓటర్లు (18 ఏళ్లు నిండినవారు) భారీ ఎత్తున ఓటు కోసం నమోదు చేసుకున్నారు. ఇది 67 శాతంగా నమోదైందని, దేశంలో తెలంగాణలోనే అత్యధికమని ఈసీ తెలిపింది. యువతలో ఈ ఉత్సాహం చూసి చాలామంది హైదరాబాద్‌లో గతం కంటే చాలా ఎక్కువగా పోలింగ్ నమోదవుతుందని ఆశించారు. కానీ, ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. దీనిపై ఓ పార్టీ నాయకుడు స్పందిస్తూ.. ‘ఐపీఎల్ మ్యాచుల మీద యువతకు ఉన్న ఆసక్తి, తమ భవిష్యత్తును మార్చే నేతలను ఎన్నుకోవడంపై లేకపోవటం విషాదం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.