Share News

AP Government : గంజాయిపై యుద్ధం!

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:41 AM

గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

AP Government : గంజాయిపై యుద్ధం!

  • కూటమి సర్కారు ప్రత్యేక చర్యలు

  • మన్యంలో మారుతున్న పరిస్థితులు

  • డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు

  • కొండల్లోని తోటలు ధ్వంసం

  • ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ

  • మరోవైపు అవ గాహన కార్యక్రమాలు

  • పటిష్ఠంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు

  • అల్లూరి జిల్లాలో సాగుకు చెక్‌

  • ఒడిశా సరిహద్దులో పెరిగిన సాగు

  • ఏపీ మీదుగానే రవాణా

  • దీనిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గంజాయి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఒకప్పుడు గంజాయి ఖిల్లాగా పేరొందిన అల్లూరి జిల్లాలో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం గిరిజనులు దాని జోలికి వెళ్లడం లేదు. గంజాయి కట్టడిలో స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి నిర్మూలనకు హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో మంత్రులు లోకేశ్‌, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, సత్యకుమార్‌లతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉపసంఘం సిఫారసు మేరకు ప్రభుత్వం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. గత ఏడాది డిసెంబరు 11న అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గంజాయి నిర్మూలన గురించి ప్రస్తావించారు. ఇటీవల అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గంజాయికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. హోం మంత్రి అనిత రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. దీంతో అధికార యంత్రాంగం గంజాయి నిర్మూలనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అవసరమైన చర్యలు చేపడుతోంది.


మూడు మార్గాల్లో చర్యలు

గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం పోలీసులు మూడు మార్గాల్లో చర్యలు చేపడుతున్నారు. అల్లూరి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి తోటలను డ్రోన్ల ద్వారా గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టేషన్‌ పరిధిలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు గంజాయి సాగు, రవాణా, వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి గిరిజన రైతులు, ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే పోలీసు స్టేషన్ల స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, రైతులతో ‘పరివర్తన’ పేరిట సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ యంత్రాంగాన్ని నిత్యం అప్రమత్తం చేస్తూ గంజాయి నిర్మూలన కార్యాచరణను పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది జూన్‌ 12 నుంచి ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 156 కేసులు నమోదు చేసి 12,491 కిలోల గంజాయిని, మూడు లీటర్ల గంజాయి లిక్విడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు వినియోగించిన 20 కార్లు, 94 బైకులు, 21 ఆటోలు, 3 భారీ వాహనాలు సీజ్‌ చేశారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉంటూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న 145 మందిని అరెస్టు చేశారు. 202 మారుమూల గ్రామాలను పోలీస్‌ బృందాలు స్వయంగా పరిశీలించాయి. 4 డ్రోన్లతో ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 900 ఎకరాల్లో పంట భూములను పరిశీలించారు. ఈ క్రమంలో జి.మాడుగుల, పెదబయలు ప్రాంతాల్లోని అడవుల్లో 32 ఎకరాల్లో గంజాయి తోటలు ఉన్నట్టు గుర్తించి దహనం చేశారు. దీంతో గంజాయి సాగుకు ఎవరూ సాహసించడం లేదు.


స్మగ్లర్ల ఆస్తుల జప్తు!

రాష్ట్రాన్ని గంజాయిరహితం చేయడంలో భాగంగా స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేయడంతో పాటు సాగుదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను రద్దు చేయాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. విశాఖ రేంజ్‌ పరిధిలోని ఉన్నతాధికారులతో ఇటీవల రెండుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన డీఐజీ గోపినాథ్‌ జెట్టి ఇదే విషయాన్ని స్పష్టంచేశారు.

ఒడిశా నుంచి ఆంధ్రాకు

కూటమి ప్రభుత్వం వచ్చాక మన్యంలో గంజాయి సాగు తగ్గుతుండగా, సరిహద్దుల్లో ఉన్న ఒడిశా లో మరింత ఎక్కువైంది. అక్కడి ప్రభుత్వం పెద్దగా చర్యలు చేపట్టకపోవడంతో గంజాయి విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు. ఆంధ్రాను ఆనుకుని ఉన్న ఒడిశా భూభాగంలో సుమారు ఐదు వేల ఎకరాల్లో గంజాయి సాగవుతున్నదని అంచనా. దానిని ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయిని రవాణా చేయాలంటే అల్లూరి జిల్లాను దాటుకుని వెళ్లాల్సిందే. అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల ద్వారా దేశంలోని పలు రాష్ర్టాలకు ఎగుమతి అవుతోంది. ఇటీవల కాలంలో ఒడిశాకు చెందిన గంజాయి, స్లగ్లర్లు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి సాగును అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.


ఐజీ నేతృత్వంలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌

రాష్ట్రంలో గంజాయి వాసన లేకుండా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇటీవల ఐజీ ర్యాంకు అధికారి ఆకే రవికృష్ణ నేతృత్వంలో ‘ఈగిల్‌’ (ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) పేరిట ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతిలో ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తారు. అదే తరహాలో టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయాలను పాడేరు, విశాఖలోనూ ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎస్‌ఐ స్థాయి అధికారి నేతృత్వంలో నార్కోటిక్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. గంజాయి మూలాలను గుర్తించి సమూలంగా నిర్మూలించే దిశగా ‘ఈగిల్‌’ వ్యవస్థ 450 మంది అధికారులు, సిబ్బందితో ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగనుంది.

వైసీపీ పాలనలో గంజాయి హబ్‌గా..

వైసీపీ ఐదేళ్ల పాలనలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోలేదు. ఒడిశాకు ఆనుకుని ఉన్న జీకే వీధి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, చింతపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల్లో అధిక విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తుండేవారు. ఆరు మండలాల్లోని 151 గ్రామాల్లో 3వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని అధికారులు అప్పట్లో ప్రకటించారు. వాస్తవానికి అంతకు పదిరెట్లు ఎక్కువగా గంజాయి సాగు అవుతోందని, కేవలం ఒడిశాను ఆనుకుని ఉన్న పల్లెల్లోనే పది వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని తర్వాత గుర్తించారు. అనంతరం పోలీసు అధికారులు నిర్వహించిన రహస్య సర్వేలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగువుతున్నట్లు తేలింది.


నాడు చర్యలు శూన్యం

గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవి. జగన్‌ పాలనలో రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిందనే పేరుంది. నాడు గంజాయి నిర్మూలనకు సరైన చర్యలు చేపట్టకపోవడమే దీనికి కారణమనే విమర్శలున్నాయి.

నేడు నిర్మూలనే లక్ష్యం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయిని సమూలంగా నిర్మూలించడంపై దృష్టిసారించింది. హోం మంత్రి అనిత నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఐజీ రవికృష్ణ నేతృత్వంలో ‘ఈగల్‌’ పేరిట స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

యాక్షన్‌ స్టార్ట్‌

కూటమి ప్రభుత్వ ఆదేశాలతో మన్యంలో స్థానిక అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. గంజాయి తోటలను డ్రోన్ల ద్వారా గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. తనిఖీలను ముమ్మరం చేసి గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లను అరెస్ట్‌ చేసి, సరుకు స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు గంజాయి మత్తు, సాగు నుంచి బయటపడేలా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు.


గంజాయి తోటలు ధ్వంసం

గత ఏడాది జూన్‌ 12 నుంచి ఇప్పటివరకూ అల్లూరి జిల్లాలో 12,491 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 444 మందిని అరెస్టు చేశారు. డ్రోన్ల ద్వారా అడవుల్లో 32 ఎకరాల్లో గంజాయి తోటలను గుర్తించి దహనం చేశారు.

ఒడిశా నుంచి ఏపీ మీదుగా

కూటమి ప్రభుత్వం గట్టిగా వ్యవహరించడంతో మన్యంలో గంజాయి సాగు తగ్గుతోంది. అయితే సరిహద్దుల్లో ఉన్న ఒడిశాలో మరింత అధికమైంది. ఆ గంజాయిని ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. కట్టడి చేయడానికి అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారిస్తోంది.

Updated Date - Jan 06 , 2025 | 03:41 AM