CM Chandrababu :కోలుకోవడానికి నిధులు కావాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:16 AM
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

పుస్తకావిష్కరణలో ఆద్యంతం నవ్వుల పువ్వుల్
వెంటిలేటర్‌పై రాష్ట్రం.. కేంద్రం చికిత్సతో ఉపశమనం!
కానీ ఇంకా ట్రీట్‌మెంట్ ఇవ్వాలి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి సహకరిస్తున్నారు
‘ప్రపంచ చరిత్ర’ ప్రతి ఒక్కరూ చదవాలి
వెంకటేశ్వరరావు బుక్ రాస్తారనుకోలేదు: సీఎం
బాబుతో వైరం.. ఒకప్పుడు ఉండేది: దగ్గుబాటి
ఎవరో చెబితే చేస్తారా?.. మరి నీ బుద్ధి ఏమైంది?
సోషల్ మీడియా పోస్టులపై వెంకయ్య ధ్వజం
కేంద్రం ‘మందు’తో ఉపశమనం!
కానీ ఇంకా ట్రీట్‌మెంట్ ఇవ్వాలి: సీఎం
‘ప్రపంచ చరిత్ర’ ప్రతి ఒక్కరూ చదవాలి: బాబు
ఇద్దరం ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారగానే ఆయన దగ్గరకు వెళ్లే వాళ్లం. అప్పజెప్పిన బాధ్యతలు చేసేవాళ్లం. అవన్నీ తలచుకున్నప్పుడు నేననుకున్నా.. వెంకటేశ్వరరావు ఏంటి.. పుస్తకాలు రాయడం ఏంటని..! 40 ఏళ్లు కలిసున్నాం.. ఆయనలో ఇంత డెప్త్ ఉందని, పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదు.
- చంద్రబాబు
విశాఖపట్నం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2047 నాటికి దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలుగు జాతి ఉండాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ గురువారం ఉదయం విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. పుస్తకం ఆంగ్ల వెర్షన్‌ను నిర్మలా సీతారామన్, తెలుగు వెర్షన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మందుల (నిధులు)తో ఉపశమనం దక్కుతోందని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. అయితే ఇంకా ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రోగి బలంగా ఉన్నప్పటికీ శక్తి (నిధులు) కావాలని, అప్పుడే పూర్తిగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను అందిస్తూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం అందిస్తున్నారని చెప్పారు. ‘ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రిని నిధుల గురించి అడిగితే నా ముందే ఫోన్ చేసి విడుదల చేయాలని చెప్పారు. విశాఖ వచ్చేసరికి నిధులు వచ్చిన విషయం చెప్పారు’ అని తెలిపారు. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, అయినప్పటికీ తాను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోనని అన్నారు.
30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి...
చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు 30 ఏళ్ల తరువాత ఒకే వేదికపై కనిపించారు. దీనికి ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం వేదికగా నిలిచింది. ఇద్దరూ వేదికపై ముచ్చటిస్తూ కనిపించారు. ప్రసంగాల సమయంలో చమక్కులు మెరిశాయి. వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
వెంకయ్య, జైపాల్‌రెడ్డిని చూసి భయపడేవాళ్లం
వెంకయ్యనాయుడు, తాను తొలిసారి ఎమ్మెల్యేలం అయ్యామని.. ఆయన తెలుగులో అనర్గళంగా మాట్లాడితే.. జైపాల్‌రెడ్డి ఇంగ్లి్‌షలో మాట్లాడేవారని, వారిని చూస్తే భయపడేవారమని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. విజయవాడలో ఒక కాలేజీలో రెండో అబ్బాయికి సీటు ఇవ్వలేదని ఎంవీవీఎస్ మూర్తి గీతం కాలేజీని ఏర్పాటుచేశారన్నారు.
ఈ పుస్తకానికి అంత విలువ ఉందా..?
చంద్రబాబుకు, తనకు వైరం ఉందని అంటుంటారని.. ఉన్నమాట వాస్తవమేనని.. కానీ ఇప్పుడు కాదని దగ్గుబాటి చెప్పారు. జీవితం ఒకే ఒక్కటని, ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లడం కీలకమన్నారు. తన పుస్తకావిష్కరణకు ప్రముఖులను ఆహ్వానించేందుకు సిద్ధమైనప్పుడు.. ఈ పుస్తకానికి అంత విలువ ఉందా అన్న సందేహం తనను వేధించిందన్నారు. అయితే తన స్నేహితుడొకరు చాట్‌జీపీటీలో ఈ పుస్తకాన్ని అప్‌లోడ్ చేసి తన సందేహాన్ని నివృత్తి చేశాక ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు చెప్పారు.
ఎవరో చెబితే చేసారా?.. మరి నీ బుద్ధి ఏమైంది?
సోషల్ మీడియా పోస్టులపై వెంకయ్య ధ్వజం
అమ్మ భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి
బాబు పాలనాదక్షుడు, అభివృద్ధి కాముకుడు
కానీ చేయగలిగేవే చేయాలి: మాజీ ఉపరాష్ట్రపతి
సోషల్ మీడియా.. యాంటీ సోషల్ మీడియాగా మారుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ‘సోషల్ మీడియాను కాస్త అదుపులో పెట్టాలని కేంద్రం ఏదో చేస్తుంటే.. మీరెలా కంట్రోల్ చేస్తారని అంతా గొడవ గొడవ చేస్తున్నారు. కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలేంటో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మీరు చూశారు. దాని పరిణామాలను ఇప్పుడు కొందరు అనుభవిస్తున్నారు కూడా. అదేమంటే.. మేం అనుకోలేదు.. మేం కాదండీ.. ఆయనెవరో, ఎక్కడి నుంచో చెప్పారని అంటున్నారు. ఆయనెవరో చెబితే చేయడానికి మీకు బుద్ధి ఉండొద్దా’ అని మండిపడ్డారు. పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ.. ఏఐతో ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్లు.. ఏదో చేస్తున్నట్లు చూపిస్తారని, దీనికి పరిష్కారం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనాదక్షుడని, అభివృద్ధి కాముకుడని పేర్కొన్న వెంకయ్య.. చేయగలిగిన వాటిపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. ‘ఆయన ఆలోచనలు మంచివి. కానీ అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేసమస్య. మనకున్న సమయం గుర్తుపెట్టుకుని,మనకు ఇచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకుని, చేయగలిగిన వాటిపై ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. మాతృభాషలో విద్యా బోధన జరగాలని చంద్రబాబు బుధవారం మంచి మాట చెప్పారు. మనదేశంలో మనం మనభాషలో మాట్లాడుకోకుండా ,ఇంకో భాషలో మాట్లాడమేంటి..?’అని వ్యాఖ్యానించారు దగ్గుబాటి ఎన్నో ఏళ్లుగా తనకు తెలుసన్నారు.
దేశ చరిత్ర వక్రీకరణకు గురైంది
నూతన విద్యావిధానంతో వాస్తవాలు తెలియజేసే యత్నం: నిర్మల
భారతదేశ చరిత్ర వక్రీకరణలకు గురైందని, చరిత్రకారులు దేశానికి మేలు చేసేలా రాయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా వాస్తవాలతో కూడిన చరిత్రను విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో ఆమె ప్రసంగించారు. ‘విలువలతో కూడిన రచనలు భావితరాలకు ఎంతో అవసరం. చరిత్ర పుస్తకాలు రాయడం అంత సులభం కాదు. దానికెంతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 350 పేజీల్లో ప్రపంచ చరిత్రను తీసుకురావడం సాధారణ విషయం కాదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూర్తిగా నిమగ్నమై పుస్తకం రాసినట్లు అర్థమవుతోంది. జరిగింది జరిగినట్లు చెప్పడమే చరిత్ర. అయితే, మనదేశ చరిత్ర ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ పుస్తకాన్ని తెలుగులో రాయడం ద్వారా వెంకటేశ్వరరావు మాతృభాష అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.’ అని అభినందించారు.
వేలెత్తి చూపలేని వ్యక్తి
దగ్గుబాటి పురందేశ్వరి
దగ్గుబాటి వెంకటేశ్వరావు భార్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. 33 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా వేలెత్తి చూపలేని వ్యక్తి డాక్టర్ దగ్గుబాటి అని తెలిపారు. అయితే ఇందులో తన పాత్ర ఏమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదన్నారు. ఇది భావితరాలకు ఉపయోగపడే పుస్తకమన్నారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ.. తన తాత (ఎంవీవీఎస్ మూర్తి)పై పుస్తకాన్ని ఇక్కడే ప్రారంభించాలని భావించామని.. అయితే మంచి పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం నిర్మల, వెంకయ్యనాయుడు, చంద్రబాబులను దగ్గుబాటి కుటుంబ సభ్యులు, శ్రీభరత్ ఘనంగా సత్కరించారు. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఫొటోలను అందజేశారు.
నవ్వులే నవ్వులు..
సభలో దగ్గుబాటి, చంద్రబాబు ప్రసంగాలు నవ్వులు పూయించాయి. తొలుత మాట్లాడిన దగ్గుబాటి.. ‘30 ఏళ్ల తర్వాత మైకు పట్టుకుని మాట్లాడుతున్నాను. బోర్ కొడుతోందా’ అని సభికులను ప్రశ్నించడంతో వేదికపై ఉన్న చంద్రబాబు సహా అంతా నవ్వారు.
..మీ అబ్బాయి బాధపడతాడు
మరో ఐదారేళ్ల తర్వాత జరిగే ఆవిష్కరణల వల్ల మరో యాబై ఏళ్లపాటు జీవన ప్రమాణం పెంచుకోవచ్చని దగ్గుబాటి అన్నారు. చంద్రబాబు వైపు చూస్తూ.. ‘మీరూ మరో 50 ఏళ్లు జీవించవచ్చు కాకపోతే మీ అబ్బాయి బాధపడతాడు’ అంటూ చమత్కరించడంతో సీఎం సహా అంతా నవ్వులు చిందించారు.
నువ్వే రాశావా.. అని అడిగా
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వెంకటేశ్వరరావు డాక్టర్ చదివారు. డాక్టర్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. కానీ మంత్రిగా ఉండి డాక్టర్ ప్రాక్టీస్ చేశారు’ అని చెప్పడంతో నవ్వులు పూశాయి. ‘అందరం ఏదో ఒకచోట తిరగాలని అనుకుంటాం. పుస్తకం రాయాలని అనుకోం. పుస్తకం గురించి నాకు చెప్పగానే.. నువ్వే రాశావా అని అనుమానంగా అడిగా’ అని చంద్రబాబు చెప్పగానే..మరోసారి అంతా పగలబడి నవ్వారు. ‘ఇద్దరం కూడా ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారి నిద్రలేస్తే ఆయన దగ్గరకు వెళ్లే వాళ్లం. ఆయన అప్పజెప్పిన బాధ్యతలు చేసేవాళ్లం. అవన్నీ తలచుకున్నప్పుడు నేను అనుకున్నా.. వెంకటేశ్వరరావు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని.. 40 ఏళ్లు కలుసున్నాం.. ఆయనలో ఇంత డెప్త్ ఉంది.. పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. మా కుటుంబంలో ఆయన రిలాక్స్‌డ్‌గా, జోవియల్‌గా ఉంటారు. రోజు ఎలా గడుస్తోందని అడిగితే, ‘‘ఉదయం బ్యాడ్మింటన్.. తర్వాత పిల్లలతో కాసేపుఆడుకోవడం, స్నేహితులతో మాట్లాడడం, సాయంత్రం పిల్లలకు కథలు చెబుతానని చెప్పారు.’’ అని సీఎం తెలిపారు. దగ్గుబాటి స్పందించి.. పేకాట కూడా ఆడతానని చెప్పానని గుర్తుచేశారు. అవును చెప్పారని చంద్రబాబు అనగానే సభికులు పగలబడి నవ్వారు. ‘రైటర్ కానటువంటి రైటర్ ఆయన. రచయిత కానటువంటి రచయిత’ అని ప్రశంసించారు. సమయం దొరికినప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతానన్నారు. లోతుగా వెళ్లి అనేక అంశాలను పొందుపరిచినట్లు అర్థమవుతోందన్నారు. అచ్చుయంత్రం, సాంకేతిక విప్లవం, భవిష్యత్తు ఆవిష్కరణల గురించి కూడా తెలియజేయడం గొప్ప విషయమన్నారు.