Share News

Chittoor : ఉగ్రవాదుల కాల్పుల్లో యువ జవాన్‌ మృతి

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:53 AM

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్‌ కార్తీక్‌(29) ప్రాణాలు కోల్పోయారు.

Chittoor : ఉగ్రవాదుల కాల్పుల్లో  యువ జవాన్‌ మృతి

ఉత్తర జమ్మూకశ్మీర్‌లో ఘటన

చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్‌ వీరమరణం

ఎగువ రాగిమానుపెంటలో నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

బంగారుపాళ్యం, అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్‌ కార్తీక్‌(29) ప్రాణాలు కోల్పోయారు. బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానుపెంటకు చెందిన వరదరాజులు, సెల్వి దంపతుల ఇద్దరు కుమారుల్లో కార్తీక్‌ చిన్నవాడు. కార్తీక్‌ ప్రాథమిక విద్యాభ్యాసం బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ చిత్తూరు పీసీఆర్‌ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ చదువుతూ 2017లో ఆర్మీలో చేరాడు. గత ఏడాది దీపావళికి ఇంటికి వచ్చి వారంపాటు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడిపారు. మే నెలలో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉత్తర జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్‌ తీవ్రంగా గాయపడగా, ఆర్మీ అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కార్తీక్‌ తండ్రి వరదరాజులకు ఫోన్‌ చేసి.. కార్తీక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. సాయంత్రం మళ్లీ ఫోన్‌ చేసి వీరమరణం పొందాడని సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఘెల్లుమన్నారు. కార్తీక్‌ మరణంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఉదయానికి కార్తీక్‌ పార్థివదేహం ఎగువ రాగిమానుపెంటకు చేరుకోనుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం

జవాన్‌ కార్తీక్‌ దేశరక్షణలో వీరమరణం పొందడంపై విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన కార్తీక్‌ ధైర్య సాహసాలు వెలకట్టలేనివని లోకేశ్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 04:54 AM