YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ABN , Publish Date - Jan 09 , 2025 | 07:15 AM
YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచార కరమని అన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.
కాగా.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వరస్వామి దర్శన టోకెన్లు ఇవ్వడానికి అధికారులు తిరుపతిలో ఏర్పాట్లు చేశారు. అయితే భక్తులు భారీగా తరలి రావడంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈతోపులాటలో ఆరుగురు భక్తులు మరణించారు. తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇదివరకు కొన్ని చిన్న చిన్న తొక్కిసలాటలు జరిగాయి కాని ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఈ ఘటన తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సంఘటనపై ఆరా తీశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.ఈ ఘటన జరగడంతో సీఎం చంద్రబాబు ఇవాళ(గురువారం) తిరుపతిలో పర్యటించనున్నారు. రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు.