Alleged Land Scam: కాకాణి అల్లుడి భూమేత?
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:37 AM
మన్నెం గోపాలకృష్ణారెడ్డి ఉన్నఫళంగా ఓ కంపెనీకి సీఈవో అయిపోయారు. అదేరోజు కోట్ల రూపాయల విలువైన సీజేఎ్‌ఫఎస్ భూ ములు కారుచౌకగా ఈ కంపెనీ పరమయ్యాయి.

కారుచౌకగా 50 ఎకరాలు కొట్టేశారు.. నాడు కోడ్‌కు ఒక్కరోజు ముందు జీవో
అదేరోజు గోపాలకృష్ణారెడ్డికి భూమి స్వాధీనం చేసిన ఏపీఐఐసీ
మార్కెట్ విలువ 100 కోట్లకు పైనే.. పేద రైతులకు చెల్లించింది 9 కోట్లే
టీడీపీ నేతల ఫిర్యాదుతో విజిలెన్స్ విచారణ.. అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక
2024 మార్చి 15న నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ ప్రాంతంలో 50.5 ఎకరాలను జీకేఎస్ కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రోజు రాత్రి ఈ జీవో జారీ చేసింది. అదేరోజు గంటల వ్యవధిలో ఏపీఐఐసీ ఈ భూములను జీకేఎస్ కంపెనీకి స్వాధీనం చేసింది. అదేరోజు కాకాణి అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డి ఈ కంపెనీలో భాగస్వామి కావడంతో పాటు ఏకంగా సీఈవో అయిపోయారు. రూ.100 కోట్లకు పైగా విలువ చేసే పేదల భూములను కారుచౌకగా 9 కోట్లకే కొట్టేశారు.
(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)
గత జగన్ ప్రభుత్వ పాలన చివరి రోజుల్లో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డి ఉన్నఫళంగా ఓ కంపెనీకి సీఈవో అయిపోయారు. అదేరోజు కోట్ల రూపాయల విలువైన సీజేఎ్‌ఫఎస్ భూ ములు కారుచౌకగా ఈ కంపెనీ పరమయ్యాయి. కాకాణి నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యేగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లోనే ఇవన్నీ జరిగాయి. ఎన్నికల్లో కాకాణి ఓడిపోయినా కారుచౌకగా పేదల ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆయన అల్లుడు మాత్రం లాభపడ్డారని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుల ఫిర్యాదుతో విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. కాకాణి అల్లుడు సీఈవోగా ఉన్న కంపెనీకి అప్పటి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైమాటే.
ఇదీ భూమి స్వరూపం
సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండ లం పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు అతి దగ్గరలో ఆ భూములు ఉన్నాయి. వైసీపీ నేత కాకాణి సర్వేపల్లికి పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్లు ఎమ్మెల్యేగా కంటే ఓ రాజులాగా నియోజకవర్గం మీద పెత్తనం చెలాయించారనేది అక్కడి ప్రజల అభిప్రాయం. నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా ఎవరికీ సెంటు భూమి పట్టా ఇవ్వడానికీ వీలులేదు. అధికారులు తమ అధికారాలను స్వతంత్రంగా వినియోగించుకునే హక్కు కూడా లేదు. అలాంటి నియోజకవర్గంలో కాకాణి అల్లుడు సీఈవోగా ఉన్న ఒక చిన్న కంపెనీకి 50.5 ఎకరాలను, అందునా పేదలకు చెందిన భూములను కారుచౌకగా స్వాధీనం చేశారనేది ప్రధాన అభియోగం. వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ ప్రాంతంలో పోర్టు రోడ్డుకు అనుకొని 50.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1976 ప్రాంతంలో ఈ భూమిని పేదలకు ఒక్కొక్కరికి 50 సెంట్లు చొప్పున పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ భూములు సీజేఎఫ్‌ఎస్ భూములుగా రెవె న్యూ రికార్డుల్లో ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు ఏర్పడిన క్రమంలో ఈ భూములకు విలువ పెరిగింది. పారిశ్రామిక విస్తరణకు అనువైన భూములగా వీటిని గుర్తించారు. ఈ భూమికి చుట్టుపక్కల రియల్ వెంచర్లు వేయడంతో పేదల చేతుల్లో ఉన్న భూముల విలువ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కనీస మార్కెట్ ధర ఎకరం కోటి నుంచి 2 కోట్లకుపైగా పలుకుతోంది.
టీడీపీ నేతల ఫిర్యాదుతో...
మాజీ మంత్రి కాకాణి పేదల నోరు కొట్టి అల్లుడికి కోట్ల రూపాయల పేదల భూములు దోచిపెట్టారని కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు పరిశ్రమల శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో డిసెంబరు 4న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ ఈ భూ కేటాయింపుల వెనుక అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేటాయింపులు చేశారని నివేదికలో పేర్కొనట్లు తెలిసింది. ఇక తదుపరి చర్యలు తీసుకోవడమే మిగిలుంది.
వైసీపీ ప్రభుత్వంలో ఆగమేఘాలపై..
కాలక్రమంలో బాగా విలువ పెరిగిన ఈ భూములపై కొందరి కన్ను పడింది. వీటిని స్వాధీనం చేసుకోవడానికి జీకేఎస్ ఇండస్ట్రియల్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ పేరుతో 2023 ఫిబ్రవరి 24వ తేదీన ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకుంది. అంతే.. ఈ భూమి కోసం 2016 నుంచి ఎదురు చూస్తున్న కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని పక్కకు నెట్టి ఏడాదికి ముందు పుట్టిన జీకేఎస్ కంపెనీకి ఈ భూమిని కేటాయించడానికి ఫైళ్లు శరవేగంగా పరిగెత్తాయి. పేదల చేతుల్లో ఉన్న ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి భూ సేకరణకు వెళ్లలేదు. భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువ కన్నా 2.5 రెట్లు ఎక్కువ ఇచ్చి పేదల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలి. అలా కూడా చేయలేదు. ప్రభుత్వ మార్కెట్ విలువ ఎకరం 15 లక్షలు ఉంటే.. అంతే మొత్తానికి పేదల ముక్కు పిండి రాయించుకున్నారు. రైతులకు చెల్లించిన 9 కోట్ల రూపాయలు కాకాణి అల్లుడి అకౌంట్ నుంచే వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. 2024 మార్చి 15వ తేదీన ఈ భూములను జీకేఎస్ కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అదేరోజు ఈ కంపెనీకి మన్నెం గోపాలకృష్ణారెడ్డి సీఈవో అయ్యారు. మంత్రి అల్లుడి కోసం వందల కోట్ల విలువజేసే పేదల భూములను అతి తక్కువ ధరకు స్వాధీనం చేసుకున్నారని ఏపీఐఐసీ అధికారులపై ఆరోపణలు బలంగా ఉన్నాయి.
కృష్ణపట్నం పోర్టు కోరినా..
పోర్టుకు సమీపంలో ఉన్న ఈ భూములను పారిశ్రామికంగా వినియోగించుకోవాలని 2016 ప్రాంతంలో రెవెన్యూ అధికారులు ఏపీఐఐసీని కోరారు. అదే సమయంలో ఈ భూములను తమకు కేటాయిస్తే మార్డన్ ట్రక్ టెర్మినల్ నిర్మిస్తామని పోర్టు యాజమాన్యం ఏపీఐఐసీని, రెవెన్యూ అధికారులను కోరింది. అయితే కారణాలు తెలియవు కానీ ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. ఏపీఐఐసీ సైతం ఈ భూములను స్వాధీనం చేసుకోలేదు. ఆ ఫైళ్లు అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?