AP NEWS: పండుగ పూట విషాదం..ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Jan 14 , 2025 | 10:44 AM
Andhrapradesh: సంక్రాంతి పండుగ పూట ఏలేశ్వరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్పోర్ట్స్ బైక్ అతివేగంగా నడిపాడు. దీంతో ఆకస్మాత్తుగా బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
కాకినాడ: ఏలేశ్వరంలో మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా షాప్‌లోకి స్పోర్ట్స్ బైక్ దూసుకుపోయింది. బైక్ అదుపు తప్పి యర్ర అబ్బాయి (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు పండు (20) పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల శివారులో ట్రావెల్స్ బస్సు టైర్ పగిలి మంటలు
నంద్యాల: నంద్యాల శివారులోని చాపిరేవుల టోల్‌గేట్ వద్ద ఎన్ఎస్కే ట్రావెల్స్ బస్సు టైర్ పగిలి మంటలు ఎగసిపడ్డాయి. ఈ బస్సు తిరువనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్ టైర్ నుంచి మంటలు వస్తున్నాయని టోల్ గేట్ సిబ్బంది అలర్ట్ చేశారు. డ్రైవర్ అప్రమత్తమవుతుండగానే టైర్ పేలి బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి ప్రయాణికులు బయటకు వచ్చారు. ప్రయాణికులందరూ సేఫ్‌గా ఉన్నారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి అగ్నిమాపక అధికారులు, పోలీసులు వచ్చారు. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.