Srisailam : సర్వం శివమయం!
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:50 AM
శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు.

మహాశివరాత్రికి ముస్తాబైన శైవ క్షేత్రాలు
శ్రీశైలం/కోటప్పకొండ(నరసరావుపేట)/శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు. బుధవారం జరిగే వేడుకలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల పూలు, విద్యుద్దీపాల అలంకరణతో ప్రధాన ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5:30 గంటలకు ప్రభోత్సవం, రాత్రి 7గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్ధరాత్రి వేళ పాగాలంకరణ, స్వామిఅమ్మవార్లకు కల్యాణమహోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఎంతో ప్రత్యేకం.. పాగాలంకరణ
మహాశివరాత్రి వేడుకల సందర్భంగా లింగోద్భవ కాలంలో జరిగే శ్రీశైలంలో పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం మూడు తరాలుగా మల్లన్నకు పాగాను అలంకరిస్తోంది. ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని పృథ్వీ కుటుంబం నేస్తుంది. కల్యాణోత్సవానికి ముందు వరుడు మల్లన్నకు తలపాగా చుట్టే తీరు అద్భుతంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజున చిమ్మ చీకట్లో దిగంబరులుగా మారి స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, నవ నందులను కలుపుతూ పాగాను అలంకరిస్తారు.
శ్రీకాళహస్తిలో...
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బుధవారం జరిగే మహాశివరాత్రి వేడులకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా తాగునీరు, బిస్కెట్లు అందించనున్నారు. తొలిసారిగా ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. ఇక, ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఆలయ ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోటప్పకొండలో ప్రభల సంబరం
మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరగనుంది. దేశ నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున స్వామికి దేవదాయ మంత్రి ఆనం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. పోలీసు శాఖ బందోబస్తుకు ఏర్పాట్లు చేసింది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నుంచి ఆర్టీసీ 550 ప్రత్యేక బస్సులను నడపనుంది. తెల్లవారుజామున 2గంటలకు బిందె తీర్థంతో స్వామికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి దర్శనం కల్పిస్తారు. అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకాలు వైభవంగా జరగనున్నాయి. 19 భారీ విద్యుత్ ప్రభలు తిరునాళ్లలో కాంతులీననున్నాయి. కోటప్పకొండ దిగువన, దేవస్థాన ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
For More Andhra Pradesh News and Telugu News..