Minister Nara Lokesh : ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మరో 216 కోట్లు
ABN , Publish Date - Feb 04 , 2025 | 03:19 AM
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు మరో రూ.216 కోట్లను రెండు మూడు రోజుల్లోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.

రెండు, మూడు రోజుల్లోనే విడుదల: లోకేశ్
విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం
ఇంజనీరింగ్ కాలేజీలతో త్వరలో వర్క్‌షాప్
ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు పదేళ్లు
యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తాం
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠశాలల ప్రతినిధులకు మంత్రి హామీ
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు మరో రూ.216 కోట్లను రెండు మూడు రోజుల్లోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలపై లోకేశ్ స్పందిస్తూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమికస్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఇంటర్ విద్యపై పదేళ్లుగా ఎలాంటి సంస్కరణలు లేవని, తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో స్థూల హాజరు నిష్పత్తి(జీఈఆర్) పెరగాలన్నారు. సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ తొలివిడతలో రూ.788 కోట్లకుగాను ఇప్పటికే రూ.571 కోట్లు విడుదల చేశామని, రెండు మూడు రోజుల్లో మిగిలిన రూ.216 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో చేపట్టే ప్లేస్‌మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ విధానంలో ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించి ఇంజనీరింగ్ విద్య నాణ్యతను పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజులను క్యాలెండర్ ప్రకారం సకాలంలో విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత ఫీజులను సవరించాలని విన్నవించారు. సమావేశంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఘం ప్రతినిధులు వాసిరెడ్డి విద్యాసాగర్, కోయ సుబ్బారావు, జి. రాజలింగ్, కె. రామ్మోహన్‌రావు, కేవీ సుబ్బారెడ్డి, వి. జయచంద్రారెడ్డి, ఆర్. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం
ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చే గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కూడా ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని యాజమాన్యాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కాగా విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్నత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులతో సోమవారం సమావేశమైన ఆయన.. గత ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడం తమ అభిమతం కాదన్నారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఐదేళ్లకు ఒకేసారి అఫిలియేషన్ జారీ చేస్తామన్నారు. అఫిలియేషన్ ఫీజు ఒక్కో యూనివర్సిటీకి ఒక్కోలా ఉందని, రాష్ట్రమంతా ఒకే అఫిలియేషన్ ఫీజు ఉండేలా చూడాలని యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. సమావేశంలో డిగ్రీ కాలేజీల ప్రతినిధులు బట్టు శ్యాంప్రసాద్, మధుబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రైవేటు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమైన లోకేశ్ ‘రాబోయే ఐదేళ్లలో ‘ఓం క్యాప్’ ద్వారా 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది మా లక్ష్యం. టీడీపీ కార్యాలయంలో శిక్షణ ఇప్పించడం వల్ల 150 మందికి అమెరికాలో ఉద్యోగాలు వచ్చాయి’ అని అన్నారు.