Share News

Sankranti : పండగొచ్చింది!

ABN , Publish Date - Jan 14 , 2025 | 03:02 AM

ఏళ్ల తరబడి బిల్లుల పెండింగ్‌తో కళ తప్పిన అనేక వర్గాల మోముల్లో సంక్రాంతి ఈసారి నిజంగానే పండగ కళను తెచ్చింది.

Sankranti : పండగొచ్చింది!

  • గత సర్కారు పెండింగ్‌కు మోక్షం.. సంక్రాంతి వేళ ఖాతాల్లోకి సొమ్ము

  • భారీగా పెండింగ్‌ బిల్లుల విడుదల

  • వివిధ వర్గాల ఖాతాల్లోకి రూ.6,700 కోట్లు

  • సర్వత్రా హర్షాతిరేకాలు

  • ఇవన్నీ జగన్‌ సర్కారులో పేరుకుపోయిన బకాయిలే

  • ఉద్యోగులు, విద్యార్థులు,కాంట్రాక్టర్లు,చిరు వ్యాపారులు, పోలీసులు, అమరావతి రైతులకు జమ

ఆంధ్రుల జీవితాల్లో కాంతులు నింపే సంక్రాంతి శోభను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ప్రతి గడపకూ తెచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, అమరావతి రైతులు.. ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ దాదాపు రూ.6,700 కోట్ల పాత బకాయిలు చెల్లించింది.

అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి బిల్లుల పెండింగ్‌తో కళ తప్పిన అనేక వర్గాల మోముల్లో సంక్రాంతి ఈసారి నిజంగానే పండగ కళను తెచ్చింది. గత ప్రభుత్వంలో భారీగా పేరుకుపోయినపెండింగ్‌ బిల్లులివి. వాటిని సరిగ్గా సంక్రాంతి పండగకు ముందు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో ఆయా వర్గాల్లో ఆనందం తొణికిసలాడుతోంది. జగన్‌ ప్రభుత్వం కొన్నేళ్లుగా అనేక శాఖల పరిధిలో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు నిలిపివేసింది. ఇందులో ఉద్యోగులు, చిన్న చిన్న కాంట్రాక్లర్లు, ఆస్పత్రులు, కళాశాలలు, ప్రభుత్వానికి మందులు, మెటీరియల్‌ సరఫరా చేసిన కంపెనీలు వంటివి అనేకం ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత తమ బిల్లులు ఇప్పించి బయటపడేయాలని ఈ వర్గాలకు సంబంధించిన వారు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంత వీలైతే అంత మొత్తం పెండింగ్‌ బిల్లులకు చెల్లింపు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, ఆ శాఖ కార్యదర్శి పీయూశ్‌ కుమార్‌ను ఆదేశించారు. మామూలుగా ఈ నెలలో ఎప్పుడో ఒకసారి ఈ డబ్బులు ఇవ్వాలని అనుకొన్నారు.


కానీ సంక్రాంతి పండగకు ముందే వీటిని ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంత మొత్తం అందుబాటులో ఉంటే అంత మొత్తం పూర్తిగా దీనికే ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అప్పుడే అందింది. ఆ డబ్బులకు రాష్ట్రం వద్ద అందుబాటులో ఉన్న నిధులు కలిపి మొత్తం రూ. 6,700 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ‘వీలైనన్ని వర్గాలకు వీటిని పంచండి. ముందు కొంత మొత్తం వస్తే ఆ వర్గాల వారిలో ఆశ చిగురిస్తుంది. మిగిలిన డబ్బులు తర్వాతైనా వస్తాయన్న నమ్మకం ఏర్పడుతుంది’ అని ఆయన ఆర్థిక శాఖకు చెప్పారు. ఆయన ఆదేశంతో ఆర్థిక శాఖ అధికారులు, మంత్రి కలిసి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్నదానిపై పెద్ద కసరత్తు నిర్వహించారు. ఉదాహరణకు వైద్య శాఖ పరిధిలో గత ప్రభుత్వం రూ. ఆరు వేల కోట్ల బకాయిలు వదిలి పెట్టి వెళ్ళింది. ఈ ఏడు నెలల్లో కొంత చెల్లించారు.

నిధుల విడుదలపై రోజంతా పర్యవేక్షణ

నిధుల విడుదలకు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొన్నారు. ఆదివారం బ్యాంకులకు సెలవు. దీనితో సోమవారం ఈ నిధులన్నీ లబ్దిదారుల ఖాతాలకు చేరేలా మంత్రి కేశవ్‌, ఆ శాఖ అధికారులు రోజంతా పర్యవేక్షణ జరిపారు. రిజర్వు బ్యాంక్‌ నుంచి ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌కు సోమవారం పనిదినం. దీంతో నిధుల విడుదల సాఫీగా జరిగిపోయిందని మంత్రి చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి తాను వివరాలు తెప్పించుకొని స్యయంగా పర్యవేక్షించానని, విడుదల చేయాలని అనుకొన్న ప్రతి రూపాయి సోమవారం సంబంధిత ఖాతాలకు వెళ్ళిపోయిందని మంత్రి తెలిపారు. ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులకు రాష్ట్రంలో సోమవారం సెలవు. అయినా ముఖ్యమైన అధికారులు విధుల్లో ఉండి ఈ నిధుల విడుదలను పర్యవేక్షించారు.

Untitled-3 copy.jpg

Updated Date - Jan 14 , 2025 | 03:02 AM