Share News

Election Results : పురపాలికల్లో కూటమి జెండా

ABN , Publish Date - Feb 04 , 2025 | 03:26 AM

రాష్ట్రవ్యాప్తంగా పలు మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల పదవులకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

Election Results : పురపాలికల్లో  కూటమి జెండా

  • అన్నింటా అభ్యర్థుల విజయం

  • టీడీపీ ఖాతాలో హిందూపురం మునిసిపల్‌ చైర్మన్‌ పదవి

  • నెల్లూరు డిప్యూటీ మేయరూ, ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్‌ పదవులూ కైవసం

  • గుంటూరు స్టాండింగ్‌ కౌన్సిల్‌లో 6 స్థానాలు కూడా

  • వీటిలో జనసేనకు ఒకటి

  • తిరుపతి, తునిలో నేటికి వాయిదా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 93 శాతం స్థానాలను గెలుచుకున్న టీడీపీ కూటమి... తాజాగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల పదవులకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మునిసిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్‌లో రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను, నూజివీడు మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని, నెల్లూరు డిప్యూటీ మేయర్‌ పదవిని, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని రెండు వైస్‌ చైర్మన్‌ పదవులను టీడీపీ దక్కించుకుంది. ఇక గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాల్లో తెలుగుదేశం ఐదు, జనసేన ఒకటి కైవసం చేసుకున్నాయి. కాగా తిరుపతి డిప్యూటీ మేయర్‌, కాకినాడ జిల్లా తుని మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మున్సిపాలిటీ చైౖర్‌పర్సన్‌ ఎన్నిక, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. పలు కారణాల వల్ల నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను మంగళవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఒక ప్రకటనలో తెలిపారు.


ఏలూరులో అలవోకగా...

ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను టీడీపీ అలవోకగా కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్లుగా పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని శ్రీనివా్‌సలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా టీడీపీ అభ్యర్థులకు 32 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మద్దతు పలికారు. 18 మంది వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉన్నారు. నూజివీడు మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని టీడీపీ దక్కించుకుంది. మునిసిపాలిటీలో 32 వార్డులు ఉండగా, టీడీపీ అభ్యర్థి పగడాల సత్యనారాయణకు 17 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా మంత్రి కొలుసు పార్థసారథి మద్దతు పలికారు. దీంతో 18 మంది సభ్యుల బలంతో సత్యనారాయణ ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేసిన నౌడు నాగ మల్లేశ్వరరావుకు 14 ఓట్లే లభించాయి. వైసీపీ నేతల రాజీనామా కారణంగా ఏర్పడిన ఈ ఖాళీలకు తాజాగా ఎన్నికలు నిర్వహించారు.

నెల్లూరులో ఘనవిజయం

నెల్లూరు డిప్యూటీ మేయర్‌ పదవి టీడీపీ ఖాతాలో జమైంది. టీడీపీ అభ్యర్థి తహసీన్‌కు 41 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపగా, వైసీపీ అభ్యర్థి కరిముల్లాకు 12 మంది మాత్రమే మద్దతు తెలిపారు. దీంతో తహసీన్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు జాయింట్‌ కలెక్టర్‌, ప్రిసైడింగ్‌ అధికారి కార్తీక్‌ ప్రకటించారు. ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. తహసీన్‌ను మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజీజ్‌, నుడా చైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి తదితరులు అభినందించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని రెండు వైస్‌ చైర్మన్‌ పదవులను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ మద్దతుతో 8వ వార్డు కౌన్సిలర్‌ పఠాన్‌ నస్రీన్‌, 9వ వార్డు కౌన్సిలర్‌ ఎర్రటపల్లి శివకుమార్‌రెడ్డి గెలుపొందారు. వీరికి 15 మంది మద్దతు తెలపగా, వైసీపీ అభ్యర్థులు బిట్రగుంట ప్రమీలమ్మ, కందుకూరు యానాదిరెడ్డికి ఆరుగురు కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు.


గుంటూరులో వైసీపీ కోటకు బీటలు

గుంటూరు నగర పాలక సంస్థలో వైసీపీ కోటకు బీటలు బారాయి. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అధిక సంఖ్యలో కూటమిలో చేరారు. తాజాగా గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. తెలుగుదేశం ఐదు, జనసేన ఒకటి గెలుచుకున్నాయి. తెర వెనక కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ పావులు కదిపారు. గుంటూరు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు మాధవి, రామాంజనేయులు, నసీర్‌ అహ్మద్‌ తదితరులు పార్టీ కార్పొరేటర్‌లను దగ్గరుండి నడిపించారు. ప్రస్తుత గుంటూరు మేయర్‌ మనోహర్‌ నాయుడుపై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నేతలు వ్యూహరచన చేస్తున్నారు. నగర పాలక సంస్థలో వైసీపీ పూర్తిగా బలాన్ని కోల్పోయింది. త్వరలో గుంటూరు మేయర్‌ పీఠం కూడా కూటమి వశం కానున్నట్టు తెలుస్తోంది.

తునిలో రసాభాస

కాకినాడ జిల్లా తుని మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ రసాభాసగా మారింది. అసంతృప్త కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారన్న సమాచారంతో వైసీపీ నాయకులు క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. సరిగ్గా ఎన్నిక సమయంలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద వీరందరితో మునిసిపల్‌ చైర్మన్‌ ప్రత్యక్షమయ్యారు. టీడీపీ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. టీడీపీ, వైసీపీ నేతలు కౌన్సిల్‌ హాల్‌లోకి చొచ్చుకుని వచ్చారు. పరస్పరం నినాదాలు చేసుకోవడంతో కౌన్సిల్‌ హాల్‌ దద్దరిల్లింది. గంట పాటు కౌన్సిల్‌ హాల్‌లో ఇదే తీరు కొనసాగడంతో ఎన్నికల అధికారి పి.వేణుగోపాలస్వామి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.


పురంలో టీడీపీ పాగా

హిందూపురం మునిసిపల్‌ చైర్మన్‌గా ఆరో వార్డు టీడీపీ కౌన్సిలర్‌ డీఈ రమేశ్‌ను ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా, 2021 ఎన్నికల్లో వైసీపీ 29 వార్డులను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఆరు స్థానాలు దక్కాయి. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్య్ర అభ్యర్థి ఒక్కోస్థానంలో గెలిచారు. వైసీపీ తరఫున మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా గెలిచిన ఇంద్రజ గత ఏడాది ఆగస్టు 15న టీడీపీలో చేరారు. ఆ మరుసటి రోజే చైర్‌పర్సన్‌ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. ఆమెతో పాటు 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వీరితో పాటు బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్‌ టీడీపీకి మద్దతు తెలిపారు. తాజా ఎన్నికలో టీడీపీ అభ్యర్థి రమేశ్‌కు 21 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి ఓటు వేశారు. వైసీపీకి 17 మంది సభ్యులు ఉండగా 14 మంది మాత్రమే ఓటింగ్‌కు హాజరయ్యారు. మునిసిపల్‌ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేశ్‌ విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి, ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌ ప్రకటించారు.


నందిగామ ఎన్నికపై తీర్పు రిజర్వ్‌

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ అయిన రెండు వార్డు కౌన్సిలర్ల స్థానాలకు ఉపఎన్నికలు జరిపిన తరువాతే చైర్‌పర్సన్‌ ఎన్నికను నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ నందిగామకు చెందిన నాదెండ్ల హారిక హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం జరగాల్సిన నందిగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదా పడింది. 20 వార్డులు ఉన్న మునిసిపాలిటీలో వైసీపీ 13, టీడీపీ 6, జనసేన ఒక స్థానంలో గెలిచాయు. పలువురు వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీకి 13, వైసీపీకి 4, జనసేనకు ఒక సభ్యుడి బలం ఉంది. మరో కౌన్సిలర్‌ తటస్థంగా ఉన్నారు. చైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ చైర్‌పర్సన్‌ మృతి చెందడంతో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పాలకొండ నగర పంచాయితీ చైర్‌పర్సన్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.


తిరుపతి, తునిలో నేటికి వాయిదా

కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్‌ ప్రకటించారు. తిరుపతి కార్పొరేషన్‌లో 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఎన్నిక జరగాలంటే 50 శాతం సభ్యులు హాజరుకావాలి. అయితే గడువులోపు 22 మంది మాత్రమే కౌన్సిల్‌ హాలుకు చేరుకున్నారు. మరోవైపు వైసీపీ ఎక్స్‌ అఫీషియో సభ్యులైన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, మేయర్‌ డాక్టర్‌ శిరీషతో కలిపి 20 మంది సభ్యులు బస్సులో వస్తుండగా, ఎస్వీయూ మెయిన్‌ రోడ్డులో జనసేన, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి నుంచి ఫోన్‌ రావడంతో ఆ పార్టీ సభ్యులు సమావేశానికి వెళ్లలేదు. కూటమి నేతలు కిడ్నాప్‌ చేశారంటూ వైసీపీ ఆరోపించిన కార్పొరేటర్లు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, సురక్షితంగా ఉన్నామని అమరనాథ్‌ రెడ్డి, అనీష్‌ రాయల్‌, అనిల్‌, మోహన్‌ కృష్ణయాదవ్‌ స్పష్టం చేశారు. కాగా తిరుపతి వెంకటేశ్వర యునివర్సిటీలోని సెనేట్‌ హాల్‌కు వెళ్లేందుకు కార్పొరేటర్లు వినియోగించే బస్సుకు పోలీసు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - Feb 04 , 2025 | 03:32 AM

News Hub