POCSO Court: నిందితులు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష!
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:32 AM
సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్టు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది.

కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసులో బెజవాడ పోక్సో కోర్టు తీర్పు
విజయవాడ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): తొమ్మిదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్టు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి వి.భవాని గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక.. తల్లిదండ్రులు చనిపోవడంతో తాత వద్ద నివసిస్తోంది. ఇంటికి దగ్గర్లోని స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన సాయు పరిచయమై తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. తర్వాత బాలిక కృష్ణా జిల్లా పెడన వెళ్లిపోయి అక్కడ 9వ తరగతిలో చేరింది. 2022 మేలో సెలవులకు బాలిక తాత ఇంటికి రాగా, రాత్రి సమయంలో సాయి వచ్చి బాలికను బయటికి పిలిచి బైక్‌పై దగ్గరలోని ఓ పాఠశాలకు తీసుకెళ్లి గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లిన సాయి మళ్లీ రెండ్రోజుల తర్వాత వచ్చి బయటికి రావాలని పిలిచాడు. ఆమె నిరాకరించడంతో తన వద్ద ఇద్దరం కలిసిన ఫొటోలు ఉన్నాయని, రాకుంటే అందరికీ చూపిస్తానని బెదిరించాడు. దీంతో బాలిక బయటికి రాగా, మళ్లీ పాఠశాల గదికి తీసుకెళ్లాడు. అప్పటికే ఉన్న మరో ఇద్దరితో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. వేసవి సెలవులు పూర్తవగానే బాలిక తిరిగి పెడ న ు వెళ్లిపోయింది. కొద్ది నెలల తర్వాత పిన్ని ఇంటికి బాలిక వెళ్లగా కడుపు ఎత్తుగా ఉండటం గమనించి పిన్ని ప్రశ్నించింది. బాలిక జరిగినదంతా చెప్పడంతో విజయవాడ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దర్శిపేటకు చెందిన సిరిగిరి చంద్రశేఖర్ అలియాస్ సాయి(24), పటమట లంబాడిపేటకు చెందిన అనురాజ్ ప్రకాశ్ అలియాస్ శ్రీను(23)ని అరెస్టు చేశారు. ఒక బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులు మరణించేంత వరకు కఠిన కారాగార శిక్షతోపాటు సాయికి రూ.32 వేలు, ప్రకాశ్‌కు రూ.20వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు.