Vizag Steel Workers : నాలుగు నెలలుగా ‘ఉక్కు’లో జీతాల్లేవు
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:43 AM
‘గత నాలుగు నెలలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులకు జీతాలు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదు. తక్షణమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’ అని ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్ కోరారు.

తక్షణమే చెల్లించేలా చొరవ తీసుకోండి
అమరావతి, పేదల ఇళ్ల నిర్మాణంలో వైజాగ్ స్టీల్‌ను వినియోగించండి
సీఎస్ విజయానంద్‌కు ఉక్కు అధికారుల సంఘం వినతి
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘గత నాలుగు నెలలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులకు జీతాలు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదు. తక్షణమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’ అని ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్ కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను కలిసి, వినతిపత్రం అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రభుత్వం తక్షణమే చేయవలసిన సాయం గురించి సీఎ్‌సకు ఆ వినతిపత్రంలో వివరించారు. పెద్ద ఎత్తున చేపట్టిన అమరావతి నిర్మాణానికి, పేదల ఇళ్లకు నాణ్యమైన విశాఖ ఉక్కును వినియోగించేలా చూడాలని కోరారు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నెలకు రూ.500 కోట్లు చొప్పున నాలుగు నెలలు అడ్వాన్సుగా ఇచ్చేట్లు ఒప్పించాలని విన్నవించినట్లు ప్రసాద్ తెలిపారు. ఉక్కు సమస్యలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, పరిష్కారం దిశగా పని చేస్తామని సీఎస్ చెప్పారని పేర్కొన్న సంఘం నేత ప్రసాద్... మంత్రి లోకేశ్, ఫైనాన్స్ సెక్రటరీ కార్యాలయాల్లోనూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
కేంద్రం పరిశీలనలో జీతాల సమస్య: పురందేశ్వరి
‘విశాఖ ఉక్కును కష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్రం మంచి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ఆలోచన చేస్తోంది. ఉద్యోగులు ఆందోళన చెందవద్దు’ అని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆమె మంగళవారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంటు సమస్యను ప్రస్తావించారు. ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు లేవని విలేకరులు చెప్పగా, ఆ విషయం కూడా కేంద్ర మంత్రి పరిశీలనలో ఉందన్నారు. తెలంగాణాలో బీజేపీ కార్యాలయంపై దాడి దారుణమని, కారకులను గుర్తించి వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పురందేశ్వరి కోరారు.
ఉమ్మడి నెల్లూరుకు భాగ్యరేఖ.. క్రిస్ సిటీ
క్రిస్‌సిటీ(కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ సిటీ)...ఉమ్మడి నెల్లూరు జిల్లా కు భాగ్యరేఖ. నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక కారిడార్‌లను నెలకొల్పుతోంది. ఇందులో భాగంగా సీబీఐసీ (చెన్నై- బెంగళూరు ఇండ్రస్ట్రీయల్ కారిడార్) ఏర్పాటుకు 13వేల ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు రూ.37,500కోట్లు. తొలివిడతగా రూ. 2,139.44కోట్లతో 2500 ఎకరాల్లో క్రిస్‌సిటీని అభివృద్ధి చేయనున్నారు. బీవీఎ్‌సఆర్ సంస్థ ఇప్పటికే పనులు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ బుధవారం అధికారికంగా శంకుస్థాపన చేస్తారు.