Sajjala RamaKrishna Reddy: అరెస్ట్ చేస్తారని భయంగా ఉంది
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:39 AM
పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు.

ముందస్తు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన సజ్జల
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సజ్జల ఇచ్చిన స్ర్కిప్ట్, ప్రోత్సాహంతోనే సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా వారి కుటుంబ సభ్యులు, కమ్మ సామాజికవర్గంపై అసభ్య పదజాలంతో దూషించానని సినీ నటుడు పోసాని ఇచ్చిన నేర అంగీకార స్టేట్‌మెంట్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. పోసానిని మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఓబుళవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.