Share News

Delhi Elections : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు..

ABN , Publish Date - Jan 21 , 2025 | 02:20 PM

ఢిల్లీలో ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పార్టీ పట్టుదలతో ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు ప్రకటించింది..

Delhi Elections : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు..
BJP MP Anurag Thakur Releases Sankalp Patra Part 2

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీని ఢిల్లీ పీఠం నుంచి ఎలాగైనా దించాలని బీజేపీ పార్టీ పట్టుదలతో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ సాధించకుండా నిలువరించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పోలింగ్‌కు ఇంకో రెండు వారాల సమయమే మిగిలి ఉండటంతో ఢిల్లీ ఓటర్లను ఆకర్షించేందుకు వరస హామీలు గుప్పిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండో మ్యానిఫెస్టో 'సంకల్ప్ పత్ర'ను ఢిల్లీలో విడుదల చేశారు. ఇందులో విద్యార్థులకు కేజీ టు పీజీ సహా అనేక బంపర్ ఆఫర్లు పొందుపరిచింది భారతీయ జనతా పార్టీ. అభివృద్ధి చెందిన ఢిల్లీ, అభివృద్ధి చెందిన భారతదేశమే తమ పార్టీ లక్ష్యమని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ అన్నారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ఎన్నికల వాగ్దానాలు చేస్తోంది బీజేపీ పార్టీ. మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎన్నికల హామీల్లో భాగంగా రెండో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ మ్యానిఫెస్టోలో పూర్తిగా విద్యారంగంపైనే దృష్టిసారించింది. బీజేపీ 'సంకల్ప పత్ర' పార్ట్-2లోని హామీలివే.


1. కేజీ నుంచి పీజీ వరకూ ప్రభుత్వ సంస్థల్లో ఉచిత విద్య.

2. పోటీ పరీక్షల (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు) కోసం సన్నద్ధమయ్యే ఢిల్లీ యువతకు ఒకేసారి రూ.15000 ఆర్థిక సహాయం.

3. పోటీ పరీక్షలు రాసేఅభ్యర్థులకు 2 ప్రయత్నాల వరకూ ప్రయాణ రుసుము, దరఖాస్తు రుసుము తిరిగి చెల్లింపు.

4.షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1000 స్టైఫండ్.

5. మహిళలకు 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు.

6. పీఎం స్వానిధి యోజన లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు.

7. ఢిల్లీలో ఆటో, టాక్సీ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు. రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా. ఆటో, ట్యాక్సీ రాయితీ వాహనాల బీమా. ఆటో డ్రైవర్ల పిల్లల ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాలు.


అవినీతిపై జీరో టాలరెన్స్‌ విధానాన్ని తీసుకొస్తామని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి చెందిన ఢిల్లీ, అభివృద్ధి చెందిన భారతదేశమే తమ పార్టీ లక్ష్యమని.. ఢిల్లీ ప్రజలకు మెరుగైన భవిష్యత్తును కల్పిస్తామని తెలిపారు. ఢిల్లీలో జల్‌ జీవన్‌ మిషన్‌, ఆయుష్మాన్ భారత్ పథకం ఇంకా అమలు కాలేదని ఆప్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేసిన‘సంకల్ప పత్రా’పార్ట్‌-1లో ‘మహిళా సమృద్ధి యోజన’కింద మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, గర్భిణులకు రూ.21వేల ఆర్థికసాయం, పేదలకు రూ.500కే సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.


ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 5న పోలింగ్‌, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోను 3 భాగాలుగా విడుదల చేస్తోంది. మొదటి భాగం ఫిబ్రవరి 17న విడుదల కాగా రెండో భాగం ఈరోజు ఫిబ్రవరి 21న విడుదలైంది.

Updated Date - Jan 21 , 2025 | 02:32 PM