Share News

National : ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబర్ దారుణ హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో శవం..

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:09 PM

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కు చెందిన యువ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురయ్యాడు. జనవరి 1వ తేదీ రాత్రిన ఇంటి నుంచి అదృశ్యమైన చంద్రకర్ సెప్టిక్ ట్యాంక్‌లో..

National : ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబర్ దారుణ హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో శవం..
Mukesh Chandrakar Journalist & Youtuber Murder Case

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కు చెందిన యువ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురయ్యాడు. జనవరి 1వ తేదీ రాత్రిన ఇంటి నుంచి అదృశ్యమైన చంద్రకర్.. బీజాపుర్‌లోని కాంట్రాక్టర్‌ సురేష్ చంద్రకర్‌ ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలాడు. సోదరుడు యుకేష్ చంద్రకర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజం వెలికితీశారు. కాంట్రాక్టర్‌ సురేష్‌కు సంబంధించిన స్థలంలోనే ముఖేష్ చంద్రకర్ మృతదేహం లభ్యం కావడంతో అతడినే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు పోలీసులు. ఈ హత్యకు సంబంధించి ముగ్గురి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.


బుధవారం సాయంత్రం ముఖేష్ చంద్రకర్ కనిపించకుండా పోవడంతో సోదరుడు యుకేష్ చంద్రకర్ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత ముఖేష్ మొబైల్ నంబర్‌ను ట్రాక్ చేసి కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్‌కు చెందిన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పరిశీలించగా ముఖేష్ మృతదేహం లభ్యమైంది. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు.


ముఖేష్ చంద్రకర్ ఎవరు?

33 ఏళ్ల ముఖేష్ చంద్రకర్ ఎన్‌డిటివి సహా అనేక వార్తా ఛానెల్‌లకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్‌లోని తకల్‌గూడ నక్సల్స్ ఆకస్మిక దాడిలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను మావోయిస్టుల చెర నుంచి విడిపించడంలో పాత్ర పోషించారు. 'బస్తర్ జంక్షన్' పేరిట ముఖేష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 1.59 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇటీవల జిల్లాలో రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని ఇచ్చిన నివేదిక వల్లే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


చంద్రకర్ హత్యపై నిరసనలు

హత్యకు పాల్పడిన కాంట్రాక్టర్‌తో పాటు ఇతరులకు మరణశిక్ష విధించాలని జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. అతడికి సంబంధించిన సెక్యూరిటీ వివరాలను తొలగించి బ్యాంకు ఖాతాలకు సీజ్ వేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ లేదా బదిలీ చేయాలని కోరారు.


యువ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో నేరాలకు, నేరస్థులకు చోటు లేదని, ముఖేష్‌ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్ట్‌ను చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం సాయి అన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 06:13 PM