Breaking News: ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:26 PM
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరిగాయన్నారు. ఐదు నెలల కాలంలో 39 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారన్నారు. మహారాష్ట్రలో బీజేపీ విజయానికి ఇదే కారణమన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఓటు కోసం నమోదుచేసుకున్నవారి సంఖ్య కంటే ఎక్కువమందిని ఎన్నికల సంఘం చూపిస్తోందన్నారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాపై తాము అధ్యయనం చేశామని, ఎన్నో అవకతవకలు బయటపడ్డాయన్నారు. ఎన్సీపీ(శరద్ పవార్), శివసేన(ఉద్దవ్) పార్టీ నేతలతో కలిసి రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నమోదు చేసుకున్న ఓటర్లతో పోలిస్తే ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ఎక్కువుగా ఉందన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై తాము ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం స్పందించి మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై పారదర్శకంగా విచారణ చేయాలన్నారు.
రాహుల్ ఆరోపణ ఏమిటంటే..
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాత భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదయ్యారన్నారు. లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఐదు నెలలకు శాసనసభ ఎన్నికలు జరగ్గా.. ఈ ఐదు నెలల్లో మహారాష్ట్రలో 39 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారన్నారు. 2019 విధానసభ ఎన్నికల తర్వాత నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల వరకు 32 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదుకాగా.. కేవలం ఐదు నెలల్లో 39 లక్షల మంది ఓటర్లు నమోదు కావడం ఏమిటని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచిన నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లు అధికంగా నమోదయ్యారన్నారు. కేవలం ఇండియా కూటమిని ఓడించడానికి బీజేపీ ఎన్నికల సంఘం సహాయంతో సరికొత్త కుట్రకు తెరలేపిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందన్నారు. భారీ సంఖ్యలో ఓటర్ల నమోదు వెనుక కుట్రదాగి ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మహారాష్ట్రలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కవు సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. ఇండియా కూటమి ఆరోపణలపై బీజేపీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News click Here