Bihar Politics: లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం నితీష్ కుమార్
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:43 PM
Bihar Politics: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. అలాంటి వేళ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
పాట్నా, జనవరి 02: మహాఘట్ బంధన్ లో జేడీ(యూ) అధినేత, సీఎం నితీష్ కుమార్ చేరేందుకు ద్వారాలు తెరిచి ఉన్నాయంటూ ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పాట్నాలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై గురువారం బిహార్ రాజధాని పాట్నాలో విలేకర్లు ప్రశ్నించగా.. సీఎం నితీష్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ఆయన నవ్వుతూ.. మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటూనే.. దానిని వదిలి వేయండన్నారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి లలాన్ సింగ్ సైతం స్పందించారు. తాము ఎన్డీయేతో కలిసి ఉన్నామని స్పష్టం చేశారు. దీనిపై స్పందించాల్సిన అవసరం అయితే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఏం కావాలో వారు చెబుతారని పేర్కొన్నారు.
ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో లాలూ ప్రసాద్ యాదవ్ ఏం మాట్లాడారంటే.. జేడీ యూ అధినేత నితీష్ కుమార్ తమతో చేరవచ్చునన్నారు. అలాగే తమతో కలిసి ఆయన పని చేయవచ్చని సూచించారు. నితీష్ కుమార్ తోపాటు అతడి వర్గానికి సైతం మహా ఘట్ బంధన్ లో చేరేందుకు తలుపులు తెరిచి ఉన్నాయని పునరుద్ఘాటించారు. నితీష్ తిరిగి రావాలని నిర్ణయించుకొంటే.. అతడికి స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. మళ్లీ కలిసి పని చేయడంలో.. తమకు ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.
మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ఇలా స్పందించారు. ఈ ఇంటర్వ్యూలో అప్పటి పరిస్థితిని దాట వేయడానికి లాలూ ఇలా మాట్లాడి ఉండవచ్చునన్నారు. అయితే నితీష్ వ్యవహారంలో తేజస్వీ యాదవ్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ తిరిగి రావాలని కోరుకున్నా.. ఆయన్ని తీసుకోబోమని గతంలో స్పష్టం చేశారు. ఆయన్ని తిరిగి మహాఘట్ బంధన్ లోకి తీసుకోవడమంటే.. తమను తాము బాధించుకోవడంతో సమానమని స్పష్టం చేశారు.
Also Read: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ
ఇక ఇటీవల బిహార్ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావాల్సి ఉంది. కానీ జేపీ నడ్డాతో భేటీ కాకుండి తిరిగి బిహార్ కు వచ్చేశారు. అలాంటి వేళ.. లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు.. బిహార్ రాజకీయల్లో ఊహాగానాలు ఊపందుకొన్నాయి. ఇంకోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి.
అదీకాక గతంలో నితీష్ కుమార్.. మహాఘట్ బంధన్ తో కలిసి ఎన్నికల్లో గెలిచారు. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. ఆయన ఆ కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో చేతులు కలిపారు. తద్వారా.. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్ అసెంబ్లీలో బీజేపీకి 84 స్థానాల బలం ఉంటే.. జేడీయూకి 48 మంది సభ్యుల బలం ఉంది.
For National News And Telugu News