Share News

Modi - Muhammad Yunus: బంగ్లా తాత్కాలిక అధినేతకు ప్రధాని మోదీ లేఖ..

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:47 PM

Modi - Muhammad Yunus: పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ దేశంలో హిందువులపై హింసాత్మక దాడులు తీవ్రమయ్యాయి. ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతున్న సమయంలో బుధవారం 53వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకున్న బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)కు ప్రత్యేక లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Modi - Muhammad Yunus: బంగ్లా తాత్కాలిక అధినేతకు ప్రధాని మోదీ లేఖ..
PM Modi Greets Yunus

Modi - Muhammad Yunus: షేక్ హసీనా (Sheikh Hasina) ప్రభుత్వాన్ని పడగొట్టి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ మహమ్మద్ బంగ్లాదేశ్ (Bangladesh)లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఆ దేశంలో హిందువులపై హింస చర్చనీయాంశంగా మారింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారిక నివేదికల ప్రకారం, ఆగస్టు 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై 2,374 కి పైగా హింసాత్మక దాడులు జరిగాయంటేనే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే చిరకాల మిత్రులైన భారత్, బంగ్లాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో స్నేహ హస్తం అందించేందుకు ఇండియా ఎల్లప్పుడూ సిద్ధమనే సంకేతం పంపిస్తూ బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని బంగ్లా తాత్కాలిక అధినేతకు లేఖ రాశారు. అందులో ఏముందంటే..


భారత సాయాన్ని గుర్తుచేసిన మోదీ..

బంగ్లాదేశ్ 53వ జాతీయ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌కు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానంగా 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అవిచ్ఛిన్న స్ఫూర్తిని భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాలకు పునాదిగా అభివర్ణించారు. ఆ దేశ స్థాపనలో భారతదేశం పాత్రను బంగ్లాదేశ్‌కు గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లో షేక్ ముజిబురాహ్మాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో లేఖలో విముక్తి యుద్ధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.


ఇంకా ఆ లేఖలో ఏముందంటే, "బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మీకు, బంగ్లాదేశ్ ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది వేసిన మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు ఈ రోజు నిదర్శనంగా నిలుస్తుంది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం స్ఫూర్తి మన సంబంధానికి మార్గదర్శక కాంతిలా కొనసాగుతోంది. ఇది బహుళ విధాలుగా వృద్ధి చెంది మన ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను కలిగించింది. శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయోజనాలు, ఆందోళనలు పరస్పరం భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాం" అని రాశారు.


ఇండియాతో మైత్రికి బంగ్లా తహతహ..

షేక్ హసీనా బంగ్లాదేశ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ దేశంలో హిందూ మైనార్టీలపై దాడులు పెరిగాయి. ఈ దాడులను భారత్ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఆందోళనలు వ్యక్తంచేస్తుండటంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పలుచబడ్డాయి. అయినప్పటికీ భారత్- బంగ్లా మైత్రిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సలహాదారు ఏప్రిల్ 3-4 మధ్య థాయ్‌లాండ్‌లో జరగనున్న ఏడు దేశాల ‘బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌’ (బిమ్‌స్టెక్‌) సమావేశంలో మోదీతో యూనస్ ద్వైపాక్షిక భేటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


Read Also: Mk Stalin: కామెడీ చేయటం మానుకోండి.. యోగిపై స్టాలిన్ ఫైర్..

Vijay: ఇక విజయ్ ఒంటరేనా.. అమిత్‌షా-ఈపీఎస్ భేటీతో డైలమాలో ‘టీవీకే’

Kunal Kamra: నిన్న షిండే.. నేడు నిర్మలా సీతారామన్.. మరో వివాదంలో కునాల్ కమ్రా

Updated Date - Mar 27 , 2025 | 01:50 PM