Rahul Gandhi: బీజేపీ, ఆరెస్సె్‌సతోనే కాదు.. భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:48 AM
కాంగ్రెస్ పార్టీ.. ఆరెస్సెస్, బీజేపీతోనే కాక.. భారత రాజ్యవ్యవస్థతో కూడా పోరాడుతోందని ఆ పార్టీ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
దేశ వ్యవస్థలన్నీ కమలం, సంఘ్ స్వాధీనమయ్యాయి
పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
రామమందిర ప్రతిష్ఠాపననాడేనిజమైన స్వాతంత్య్రం
అన్న మోహన్‌భాగవత్ వ్యాఖ్యలపైనా తీవ్ర ఆగ్రహం
ఆ వ్యాఖ్యలు దేశద్రోహంతో సమానమని మండిపాటు
రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వికృత వాస్తవ రూపం
బయటపడింది: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
న్యూఢిల్లీ, జనవరి 15: కాంగ్రెస్ పార్టీ.. ఆరెస్సెస్, బీజేపీతోనే కాక.. భారత రాజ్యవ్యవస్థతో కూడా పోరాడుతోందని ఆ పార్టీ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఏఐసీసీ నూతన ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం బీజేపీ, ఆరెస్సెస్ అనే రాజకీయ సంస్థలతో పోరాడుతున్నామని మీరు భావిస్తుంటే.. అసలేం జరుగుతోందో మీకు అర్థం కానట్టే. ఆ రెండూ మనదేశంలోని ప్రతి వ్యవస్థనూ స్వాధీనం చేసుకున్నాయి. మనం పోరాడుతున్నది బీజేపీ, ఆరెస్సె్‌సతోపాటు భారత రాజ్య వ్యవస్థతో కూడా’’ అని ఆయన పేర్కొన్నారు. దళితులు, మైనారిటీలు, బీసీలు, ఎస్టీల నోరు మూసేయడం ద్వారా ద్వారా ప్రధాని మోదీ దేశ గళాన్ని అణచివేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. అలాగే.. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు దేశ ద్రోహంతో సమానమని.. ఇవే వ్యాఖ్యలు మరే దేశంలోనైనా చేసి ఉంటే.. వెంటనే ఆయన్ను అరెస్టు చేసి, విచారణ జరిపి ఉండేవారని దుయ్యబట్టారు. భారతదేశం 1947లో స్వాతంత్య్రం పొందలేదని చెప్పడమంటే భారతీయులందరినీ అవమానించడమేనని ధ్వజమెత్తారు.
‘‘స్వాతంత్ర్యోద్యమం, రాజ్యాంగం గురించి తాను ఏమనుకుంటున్నానో ప్రతి 2-3 రోజులకొకసారి దేశప్రజలకు చెప్పే తెంపరితనం మోహన్ భాగవత్‌కు ఉంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశద్రోహమే. ఎందుకంటే.. రాజ్యాంగానికి, బ్రిటిషర్లతో పోరాటానికి విలువ లేదని ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి’’ అని రాహుల్ నిప్పులు చెరిగారు. అలాంటి నిరర్థకమైన మాటలను పట్టించుకోవద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇక దాపరికం లేదు. కాంగ్రెస్ పార్టీ వికృత వాస్తవ రూపం ఆ పార్టీ నేత ద్వారానే బయటపడింది. ఈ దేశానికి ఇప్పటికే తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పినందుకు రాహుల్‌ను నేను ప్రశంసిస్తున్నాను. ఆయన చెప్పే మాటలు, చేసే పనులు అన్నీ.. దేశ విచ్ఛిన్నం దిశగా, సమాజాన్ని విభజించే దిశగానే ఉంటున్నాయి’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. అర్బన్ నక్సల్స్‌తో, భారతదేశ ప్రతిష్ఠను తగ్గించి అపకీర్తిపాలు చేయాలనుకునే తెరవెనుక శక్తుల (డీప్ స్టేట్)తో రాహుల్‌గాంధీకి, ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థకు సంబంధాలున్నాయని నడ్డా ఆరోపించారు. ఇక.. భారత రాజ్యవ్యవస్థపై పోరాడుతున్నామని చెబుతున్న రాహుల్‌గాంధీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.